
దర్యాప్తు సంస్థల నుంచి మీరే రక్షించాలంటూ సీజేఐ బెంగాల్ సీఎం విజ్ఞప్తి
దర్యాప్తు సంస్థల నుంచి ప్రజలను రక్షించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను కాపాడాలని సీజేఐను ఆమె అభ్యర్థించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగిన వారం రోజుల తర్వాత దీదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శనివారం కలకత్తా హైకోర్టు జల్‌పాయిగురి ధర్మాసనం కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశ ప్రజానీకం పట్ల దర్యాప్తు సంస్థలు తప్పుగా వ్యవహరించకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ''దయచేసి వినాశనం నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను, చరిత్రను, భౌగోళిక, దేశ సరిహద్దులను కాపాడండి.. చట్టపరంగా రాజ్యాంగ పరిరక్షకులైన మీ సంరక్షణలో మేము ఉన్నాం. న్యాయవ్యవస్థలో మిమ్మల్ని మించినవారు లేరు. కులం, మతం ఆధారంగా వివక్షను చూపకూడదని దేశ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. ఐకమత్య సాధన కోసం మాట్లాడదాం, ఆలోచిద్దాం.. కలిసి పనిచేద్దాం'' అని ఆమె వ్యాఖ్యానించారు.
'పరువు తీయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రజలను రక్షించండి. నేను ఇది నా కోసం చెప్పడం లేదు. ప్రజలను, న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడమని చెబుతున్నాను' అని అన్నారు. అలాగే, మీడియా సంస్థలు విచారణ ధోరణి నిలిచిపోవాలని దీదీ పేర్కొన్నారు.
మనీల్యాండరింగ్ కేసులో తమ దర్యాప్తునకు మమతా బెనర్జీ ఆటంకం కల్పించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ విపుల్ పాంచోలిల ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. ''కొన్ని పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. వాటికి సమాధానం లభించకపోతే, అది అరాచకానికి దారితీస్తుంది. ఒక తీవ్రమైన నేరాన్ని దర్యాప్తు చేయడానికి కేంద్ర సంస్థలు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు పార్టీ కార్యకలాపాల ద్వారా వాటిని అడ్డుకోవచ్చా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది: ?'' అని ధర్మాసనంలోని న్యాయమూర్తులు అన్నారు.