
ఉమర్ ఖలీద్‌కు బెయిలివ్వాలి.. మాజీ సీజేఐ చంద్రచూడ్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్‌కు బెయిల్ ఇవ్వాలని మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన..
'ఐడియాస్ ఆఫ్ జస్టిస్' సెషల్‌లో ఈ కేసును ప్రస్తావించారు. అండర్ ట్రయల్ ఖైదీగా 5-7 ఏళ్లు ఉన్న వ్యక్తి, చివర్లో నిర్దోషిగా తేలితే పోయిన కాలాన్ని ఎవరూ తిరిగివ్వలేరని చంద్రచూడ్ తెలిపారు. నేరం నిరూపితమయ్యే వరకు నిందితులను నిర్దోషులుగా చూడటమే భారత న్యాయవ్యవస్థకు మూలస్తంభం అన్న ఆయన.. బెయిల్ అనేది రూల్ అని, మినహాయింపు కాదనే తన వాదనను మరోసారి పునరుద్ఘాటించారు. సమాజానికి ప్రమాదకరమైతేనో, పారిపోయే అవకాశం ఉంటేనో, సాక్ష్యాధారాలను తారుమారు చేసే చాన్స్ ఉంటేనో మాత్రమే బెయిల్ నిరాకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మారిటల్ రేప్.. ఇప్పటికీకేసు కాదు..!
ఇదే క్రమంలో మారిటల్ రేప్ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'భార్యను చంపిన భర్త హంతకుడు అవుతాడు. కానీ లైంగికంగా దాడి చేస్తే కేవలం ఆమెను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి మాత్రమే అవుతాడు. పెళ్లి అయిన తర్వాత ఆమెకు ఇష్టం లేకుండా సెక్స్ జరిగినా.. ఆమెకు ఎలాంటి రక్షణ లేదు' అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఈ పరిస్థితి ఉండటం నైతిక విలువల వైఫల్యమని అభిప్రాయపడ్డారు. తను రిటైర్ అయ్యే సమయంలో వచ్చిన కేసును గుర్తుచేసుకున్న ఆయన.. ఆ సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సి రావడంతో మారిటల్ రేప్‌పై సరైన తీర్పు ఇవ్వలేకపోయానన్నారు. ఇప్పటికీ ఆ బాధ తనను వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు.