logo

ఏపీ సమాచార కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది పి.ఎస్. నాయుడు నియామకం: అధికారిక ఉత్తర్వులు జారీ



సమాచార హక్కు చట్టం -2005 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా విశాఖపట్నం జిల్లా ప్రముఖ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు (పి.ఎస్. నాయుడు)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పరిపాలనా సంస్కరణలు) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వుల ప్రకారం, బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు పూర్తి అయ్యే వరకు (ఏది ముందుగా జరిగితే అది) పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్‌కు వర్తించే వేతనాలు, అలవెన్సులు, సేవా నిబంధనలు సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ త్వరలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పి.ఎస్. నాయుడు, కష్టపడి చదువుకుని న్యాయరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావంతో అంచలంచెలుగా ఎదుగుతూ ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం విశేషమని న్యాయవర్గాలు కొనియాడుతున్నాయి.
గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం బోర్డు డైరెక్టర్‌గా, విశాఖపట్నం ప్రధాన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. న్యాయపరమైన నైపుణ్యం, ప్రజల సమస్యల పట్ల స్పందించే మనస్తత్వం, నిష్పక్షపాత దృక్పథం ఈ స్థాయికి చేర్చిన ప్రధాన కారణాలుగా నిలిచాయి.
పి.ఎస్. నాయుడు కుమారుడు హైకోర్టు అడ్వకేట్‌గా న్యాయరంగంలో సేవలందిస్తుండగా, కుమార్తె వైద్యురాలిగా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సతీమణి వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఈ విధంగా కుటుంబమంతా సమాజ సేవకే అంకితమై ఉండడం విశేషం.
ఈ అత్యున్నత బాధ్యతను స్వీకరించిన పి.ఎస్. నాయుడు, సమాచార హక్కు చట్టం అమలులో మరింత పారదర్శకత, న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉమ్మడి విశాఖపట్నం ప్రజా ప్రతినిధులు, విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కే. శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్. కృష్ణమోహన్, పి. నర్సింగరావు, కేజేఆర్ మురళి, బైపా అరుణ్ కుమార్, ఏజీపీ కన్నూరు అప్పలనాయుడు, పైన సన్న బాబు తదితరులు పి.ఎస్. నాయుడుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సేవలు రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు.

21
932 views