logo

వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై కలెక్టరేట్ వద్ద ధర్నా: కూటమి సర్కార్‌పై మజ్జి శ్రీనివాసరావు నిప్పులు

విజయనగరం, జనవరి 17: ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ ఛైర్పర్సన్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపైన, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హత్యా రాజకీయాలతో చలి కాచుకుంటోందని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సల్మాన్ ను టీడీపీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా కొట్టి చంపడాన్ని మజ్జి శ్రీనివాస్ రావు( చిన్న శ్రీను) తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దళితులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, హత్యలను ఖండిస్తూ నినదించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన ప్రజా స్వామ్య రాజ్యాంగాన్ని కాకుండా మంత్రి నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హతమారుస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హతమార్చడం రాష్ట్రం కూటమి ప్రభుత్వ అరాచకాలకు అద్దం పడుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు, దళిత సానుభూతిపరులను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. దాంతో దాదాపు మూడు వందల కుటుంబాలు ఆ గ్రామాన్ని వీడి భయంతో వేరే ప్రాంతాల్లో తలదాచుకునే దుస్థితి కలిగిందన్నారు. భార్యకు అనారోగ్యమని ఊరుకు వచ్చిన వైసీపీ కార్యకర్త సాల్మన్ పై టీడీపీ గుండాలు రాళ్ళు, ఇనుప రాడ్డులతో దాడులు చేయగా, వైసీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గురజాల ఇంచార్జ్ కాసు మహేశ్వర రెడ్డి, వైసీపీ నాయకులు ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాడని కృషి చేసినా, గాయాల తీవ్రత వల్ల మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా, దళిత హోం మంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ప్రాధమిక విచారణ గానీ, దోషులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను భూమ్మీద లేకుండా చేస్తే వైసీపీ వూర్తిగా లేకుండా పోతోందని కుట్రతో ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లగా దాడులు చేస్తూ, హత్యా కాండలకు పాల్పడుతుందని ద్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ పోలీస్, న్యాయ, అధికార వ్యవస్థలను సక్రమంగా పని చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దళితులంటే చులకన భావన ఉందన్నారు. గతంలో దళితుల ఇంట ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ దళితులను హీనంగా చూస్తూ చంద్రబాబు అవహేళన చేశారని మజ్జి శ్రీనివాస్ రావు గుర్తు చేశారు. దళితులంటే మీకు మనుషుల్లా కనిపించట్లేదా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలోని దళిత ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా కోర్టులో మరణ శాసనం రాయబోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎక్కడా ఎవరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టాన్ని చేసుకున్నా వెంటనే చర్యలు తీసుకునే వారని గుర్తు చేశారు. ఆయన ఎన్నడూ తారతమ్య బేధాలు చూపకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో పాలన చేశారని అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి అనేక హత్యలు, అరాచకాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాస్ రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా బీసీ సెల్ అధ్యకుడు మహంతి జనార్ధన్, జిల్లా ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నరసింహ మూర్తి, గొర్లి రవికుమార్, వైసీపీ నాయకులు పట్నాల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

16
764 views