logo

శాంతిభద్రతలు, మహిళా భద్రతే లక్ష్యం: పోలీసు స్టేషన్ల తనిఖీలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్


విజయనగరం జిల్లాలోని గుర్ల, గరివిడి, రాజాం మరియు రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న సందర్శించి, పోలీసు స్టేషను ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అందుబాటులో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి మిఠాయిలను ఎస్పీ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - పండుగ సందర్భంగా ప్రయాణాలు చేస్తున్న ప్రజలకు “రిటర్న్ జర్నీ – సేఫ్ జర్నీ” పేరిట జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమం పట్ల తగు సూచనలు ఇచ్చి గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకునే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనదారులకు భద్రత నియమాలు, హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితుల సమస్యలను సామరస్య పూర్వకంగా అడిగి తెలుసుకోవాలన్నారు. సమస్య ప్రాధాన్యతను బట్టి వెంటనే చర్యలు చేపట్టాలని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, వారికి న్యాయం చేయాలన్నారు. స్మార్ట్ పోలీసింగుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని, అందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడే వారిని, గంజాయి, మహిళల పట్ల దాడులకు పాల్పడే వారిని, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగించే స్థావరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. మహిళలు, బాలల భద్రతకు పెద్ద పీట వేయాలని, పాఠశాల స్థాయిలోనే విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించాలన్నారు.
ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టు పేరుతో సైబరు మోసగాళ్ళు అమాయకులను భయపెట్టి డబ్బులు కొల్లగొడుతున్నారని, అటువంటి నేరాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. "డిజిటల్ అరెస్టు" అన్నది పోలీసు వ్యవస్థలో లేనే లేదన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో తెలియజేయాలన్నారు. ప్రజలతో మమేకయ్యేందుకు పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
పోలీసు సిబ్బందితో స్వయంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను, విధుల నిర్వహణలో గల ఇబ్బందులను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఈ తనిఖీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

2
278 views