logo

పలాస.. వెంకటేశ్వరాలయంలో భారీ చోరీ

శ్రీకాకుళం:పలాస: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన చోరీ పోలీసులను, భక్తులను ఉలిక్కిపడేట్లు చేసింది. దొంగలు స్వామికి అలంకరించిన నగలు మాత్రమే ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న అమ్మవార్ల విగ్రహాల జోలికి వెళ్లలేదు. కాశీబుగ్గకు చెందిన ఆధ్యాత్మిక వేత్త హరిముకుందపండా ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రెండేళ్ల కిందట నిర్మించారు. స్వామి ఉత్సవమూర్తికి 11 కిలోల వెండి ఆభరణాలతో పాటు 9 తులాల బంగారు నామాలు చేయించి ఇటీవల అలంకరించారు. ఈ ఆలయంలో గతేడాది నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నిలువరించలేక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 17 మంది వరకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించి వారి ఆదేశాల మేరకే పనులు చేపట్టి.. ఆలయాన్ని తెరిపించుకోవాలని ఆంక్షలు విధించింది. దీంతో అప్పటి నుంచి ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. అధికారుల అనుమతితో ధర్మకర్త హరిముకుందపండా మాత్రమే రోజూ ఆలయంలోకి వెళ్లి స్వామికి కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తున్నారు. వారం కిందట స్వామికి రూ.18లక్షల విలువైన బంగారు నామాలు అలంకరించారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాతోపాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించారు.

సోమవారం వేకువజామున ముకుందపండా అల్లుడు కోట్ని శివకుమార్‌ ఆలయం తలుపులు తెరిచేందుకు వెళ్లగా.. ప్రధాన గేటు తాళం చెవి పెట్టగానే లాక్‌ ఓపెన్‌ అయింది. అనుమానంతో ప్రధాన ఆలయానికి వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలు కనిపించలేదు. వాటితోపాటు ఆలయంలోని మూడు హుండీలు తెరిచి చిల్లర అక్కడే పడేసి.. నగదు అపహరించినట్టు గుర్తించారు. వెంటనే ధర్మకర్త ముకుందపండా.. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. స్వామికి అలంకరించిన రూ.50లక్షల విలువైన ఆరున్నర తులాలు బంగారం, 15 కేజీల వెండి ఆభరణాలతోపాటు మూడు హుండీల్లో దాదాపు 4 లక్షల నగదు చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు.

క్లూస్‌టీమ్‌, పోలీసుల పరిశీలన

కాశీబుగ్గ డీఎస్పీ షహబాజ్‌ అహ్మద్‌, సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. మరోవైపు శ్రీకాకుళం, కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల నుంచి మూడు క్లూస్‌టీమ్‌లు వచ్చి.. పరిశీలించాయి. వేలి, పాదముద్రలు సేకరించాయి. ఆలయంలో సీసీ కెమెరాలకు సంబంధించి సెటాప్‌ బాక్స్‌ను, డీవీడీలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. వీటిని తొలగించిన తర్వాతే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన మార్గంలో ఉన్న తాళాలు తెరిచి మళ్లీ యథాతఽథంగా అక్కడే పెట్టారు. చోరీ అనంతరం ఆలయం ప్రక్కనే ఉన్న ఐరన్‌ గ్రీల్‌ను తొలగించి అక్కడ నుంచి ఉడాయించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆలయంలో పూర్తిస్థాయి రెక్కీ నిర్వహించిన తరువాతే దొంగలు చొరబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసు పహారా ఎత్తివేత

తొక్కిసలాట ఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఆలయ అభివృద్ధి పనులతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు పనులు పూర్తయ్యాయి. త్వరలో ఈ ఆలయాన్ని తెరిచి.. స్వామి దర్శనానికి భక్తులను అనుమతిచ్చేలా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పోలీసు భద్రత అవసరం లేదని, ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకుంటామని నిర్వాహకులు చెప్పారు. దీంతో రెండు రోజుల కిందటే పోలీసు పహరా ఎత్తివేశారు.

రెండు రోజుల కిందటే కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ ఈ ఆలయాన్ని సందర్శించి విగ్రహాలకు ఉంచిన ఆభరణాలను భద్రపరచాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని ఆదేశించారు. దీనిపై హరిముకుందపండా అంతా స్వామివారే చూసుకుంటారని, చోరీ జరిగే అవకాశం లేదని బదులిచ్చారు. ఇంతలోనే ఈ ఆలయంలో చోరీ జరగడం గమనార్హం. కాగా వెంకటేశ్వరస్వామికి ఇరువైపులా మరో ఆలయాల్లో అలివేలు, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలకు కూడా బంగారం, వెండి ఆభరణాలు అలంకరించి ఉన్నాయి. దొంగలు వాటి జోలికి వెళ్లకుండా.. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం తలుపులు మాత్రమే తెరిచి స్వామికి అలంకరించిన వస్తువులు, హుండీల్లో నగదును దొంగిలించారు. అమ్మవారి ఆలయాలు కూడా తెరిచి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని అంతా భావిస్తున్నారు.

కొత్తవారికి ఈ ఆలయంలో చోరీ చేయడం కష్టసాధ్యం. ఆలయం ప్రధాన ద్వారం నుంచి 100 మీటర్లు వెళితేనే తప్ప.. ప్రధాన ఆలయానికి చేరుకోలేము. ఎక్కడ ఏ ఆలయం ఉన్నదీ చెప్పుకోవడం కష్టమే. కానీ దొంగలు సులభంగా చోరీకి పాల్పడి తప్పించుకుని వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో కూడా హరిముకుంద పండా ఇంట్లో ఉన్న దుర్గమ్మ విగ్రహానికి అలంకరించిన 300 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.4 లక్షల నగదు చోరీకి గురైంది. ఆ కేసునకు సంబంధించి దొంగలు ఇప్పటికీ దొరకలేదు.

1
233 views