logo

హన్మకొండలో 300 వీధి కుక్కలను చంపిన ఘటన.. 9 మందిపై కేసు నమోదు

హన్మకొండ జిల్లాలో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 9న జంతు సంక్షేమ కార్యకర్తలు అదులాపురం గౌతమ్, ఫర్జానా బేగం దాఖలు చేసిన ఫిర్యాదులో జనవరి 6 నుండి మూడు రోజుల్లో శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో 300 వీధి కుక్కలు చంపినట్టుగా వెల్లడించారు.
సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు.. వ్యక్తులను నియమించుకుని కుక్కలకు విషం ఇచ్చి చంపి తర్వాత శాయంపేట, ఆరెపల్లి గ్రామాల శివార్లలో పాతిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధికుక్కల ప్రాణాలను బలితీసుకున్నారు. ఇప్పటికే 120కిపైగా పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసులు, వెటర్నరీ సిబ్బంది వెలికితీశారు.

మరోవైపు వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. మెుత్తం 9 మందిపై కేసులు నమోదు అయ్యాయి. కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని, ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండటం కారణంగానే వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున కుక్కల మరణాల నివేదికలను ధృవీకరించడానికి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన జంతు సంక్షేమ కార్యకర్తలు ఫర్జానా బేగం, అదులపురం గౌతమ్ గ్రామాలను సందర్శించిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు విష ఇంజెక్షన్లను ఉపయోగించి వీధి కుక్కలను చంపారు. స్థానిక అధికారులకు తెలిసే వీధి కుక్కలను చంపారు.

ఈ సంఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త గౌతమ్ మాట్లాడుతూ, విచ్చలవిడిగా జంతువులను సామూహికంగా చంపడం చట్టవిరుద్ధం అన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నియమాలు, 2023ని కఠినంగా అమలు చేయడమే ఏకైక శాస్త్రీయ మరియు మానవీయ పరిష్కారం అని ఆయన నొక్కి చెప్పారు. స్థానిక సంస్థల వైఫల్యమే ఈ విషాదానికి కారణమని ఆరోపించారు.



3
776 views