logo

సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ పై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి నోటీసులు

సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ (Lifetime protection)పై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. అలాగే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనల బిల్లు-2023 లోని ఒక నిబంధన పై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సీఈసీ, ఈసీలకు సివిల్, క్రిమినల్ చర్యల నుంచి జీవితకాల మినహాయింపు (Immunity) కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ (EC)కు నోటీసులు జారీ చేసింది.

రాజ్యాంగ నిర్మాతలు న్యాయమూర్తులకు సైతం కల్పించని 'జీవితకాల రక్షణ'ను, పార్లమెంటు చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్ లకు ఎలా కల్పిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. రాజ్యాంగంలోని ఇతర ఉన్నత పదవుల్లో ఉన్నవారికే లేని ఈ మినహాయింపును ఎన్నికల కమిషనర్లకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, "మేము దీనిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది" అని వ్యాఖ్యానిస్తూ, తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేశారు.

0
88 views