
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఆ హీరో సినిమాపై కక్ష గడతారా: హరీశ్ రావు
తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంటే మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రేమో నాకు ఆజీవోల విషయంలో నా ప్రమేయం లేదని అసలు ఆ ఫైల్స్ తన వద్దకే రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారని దుయ్యబట్టారు. శాఖ ఒకరిదైతే, పెత్తనం మరొకరిదని ఇక జీవో ఇచ్చేది ఇంకొకరని విమర్శించారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు పెంపు జీవోల విషయంలో తనకు ఏసంబంధం లేదని నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హరీశ్ రావు ఒక ప్రకటనలో స్పందించారు.
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీనా?
రేవంత్ రెడ్డి గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా అని హరీశ్ రావు నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం అన్నారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు అని మండిపడ్డారు. చెప్పేదొకటి, చేసేది మరొకటి పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి అని దుయ్యబట్టారు. 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టావ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇ వాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా?' అని నిలదీశారు.
మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తోంది:
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంటే సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు. అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా? లేనట్టా? సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు.
తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది:
ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే అని నిలదీశారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని మండిపడ్డారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉందన్నారు. 'వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా? వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా? రేవంత్ రెడ్డి.. పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదు' అని అన్నారు.
ఆ అదృశ్యశక్తి వివరాలు బయటపెడతాం:
గత పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని ఎక్కడా వివక్ష చూపలేదన్నారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయన్నారు. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం.. మరొకరికి శత్రుత్వం ఉండకూడదన్నారు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట అన్నారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించి దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.