
పారిశుద్ధ్య కార్మికులే పట్టణానికి నిజమైన వీరులు.. ఎమ్మెల్యే కూన రవికుమార్
AIMA న్యూస్ శ్రీకాకుళం :
ఆముదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం చాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, సబ్బులు, నూనెతో కూడిన అవసరమైన కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అమూల్యమని, వారి సేవల వల్లనే ప్రజలు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. ఎండా, వానా, కాలం చూడకుండా ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని కూన రవికుమార్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల్లో ఉత్సాహం పెరిగిందని, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తోందన్న నమ్మకం కలిగిందని పలువురు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.