మాకవారిపాలెం-రావికమతం-రోలుగుంట సరిహద్దుల్లో తీవ్ర తనిఖీలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్‌లో ఈ రోజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపిఎస్ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ పి.దామోదర్ నాయుడు, గొలుగొండ ఎస్ఐ పి.రామారావు, జిల్లా స్పెషల్ టీమ్ సిబ్బంది, మాకవరపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు.మాకవరపాలెం, రావికమతం, రోలుగుంట సరిహద్దు ప్రాంతాల్లో మెగా డ్రైవ్ చేపట్టారు. డ్రోన్‌ల సహాయంతో గగనతల సర్వే నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ బృందాలను విభజించి, పరిసర గ్రామాలైన జె.నాయుడుపాలెం, తూటిపాలెం, బుచ్చయ్యపాలెంలో కూడా డ్రోన్ సర్వేలు చేపట్టారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ కోడిపందాలు, గుళ్లాట, పేకాట వంటి జూద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ చర్యల్లో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. శాంతి, భద్రతల పరిరక్షణకు సహకరించి, అనుమానాస్పద సమాచారం సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.