
సావిత్రిబాయి ఫూలే ఆర్గనైజేషన్‌లో 'ఉపాధ్యాయ రత్న – 2026' అవార్డు
విద్యా రంగంలో 27 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలు అందించిన రోలుగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంగ్లీష్ సామాన్య అధ్యాపకురాలు శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి కి సావిత్రిబాయి ఫూలే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'ఉపాధ్యాయ రత్న – 2026' అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆదర్శ ఉపాధ్యాయురాలిగా ఆమె గుర్తింపు పొందారు.ఆధునిక ఐసీటీ ఆధారిత బోధన, సృజనాత్మక పద్ధతులు, డిజిటల్ కంటెంట్‌ల ద్వారా తరగతి గదులను ఉత్సాహభరిత అధ్యయన కేంద్రాలుగా మార్చినందుకు అవార్డు కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కెప్టెన్‌గా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తిని పెంపొందించారు.డ్రాప్‌ఔట్ పిల్లలను బడికి తిరిగి చేర్చడం, సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్‌జీఓలతో సమన్వయం వంటి కార్యక్రమాల్లో ఆమె పాత్ర ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పవర్‌లిఫ్టర్‌గా భారతదేశానికి పలు పతకాలు సాధించి, విద్యార్థులకు క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల, ఆరోగ్య జీవన విలువలను ప్రేరణగా నిలిచారు.అవార్డు స్వీకరించిన నాగజ్యోతి మాట్లాడుతూ, ఈ గౌరవం తన బాధ్యతలను మరింత పెంచిందని, భవిష్యత్తులో విద్యా-సామాజిక రంగాల్లో అంకితభావంతో సేవలు కొనసాగిస్తానని తెలిపారు.