
ఘనంగా పారా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు: విజేతలకు రాష్ట్ర స్థాయికి అవకాశం
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో పారా (దివ్యాంగుల) అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు.
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ మాట్లాడుతూ ప్రధానంగా రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నామని, ఈనెల 27న నెల్లూరులో జరుగబోయే 8వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల ఎంపికల కోసం ఈ జిల్లా స్థాయి పోటీలను అన్ని జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్ర స్థాయిలో విజేతలైన వారు ఫిబ్రవరిలో ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ తో బాటు, వైస్ ప్రెసిడెంట్ పి. కళ్యాణి, జాయింట్ సెక్రటరీ కె. లక్ష్మి, శ్రీకాకుళం అధ్యక్షుడు రాము, ట్రెజరర్ స్రవంతి, కోచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.