logo

పోలీసు కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి: స్వాతంత్ర్య సమరయోధుడికి ఘన నివాళి



విజయనగరం: స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి ప్రాంతానికి చెందిన వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాలతో జనవరి 11న జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్ర పటానికి ఏఆర్ డీఎస్పీ ఇ. కోటిరెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.
రేనాటి ప్రాంతం, సంచార వడ్డెర కులానికి చెందిన వడ్డె ఓబన్న బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర సమర యోధుడన్నారు. రేనాటి ప్రాంతానికి చెందిన పాళెగాళ్లకు మరియు ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపి సాయుధ పోరాటాలుగా మారాయన్నారు. ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించి, వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించి, ఈస్టిండియాకు చెందిన బ్రిటీషు సైన్యాన్ని ఉరుకులు పెట్టించడంలో ముఖ్యపాత్ర పోషించారన్నారు.
అటువంటి స్వాతంత్య్ర సమర యోధుని జయంతిని నేడు జరుపుకోవడం, అతని త్యాగాలు భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఇ. కోటిరెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్. గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని వడ్డే ఓబన్న చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పించారు.

0
222 views