logo

అమ్మ జన్మనిస్తే.. హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది: యువజన దినోత్సవంలో ఎస్పీ దామోదర్


విజయనగరం పట్టణం గురజాడ కళా క్షేత్రంలో 'చేయూత' ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.రాము ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని జనవరి 10న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి, వివేకానందుని చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - వివేకానంద స్వామి జన్మదినానికి గుర్తుగా ప్రతీ ఏడాది యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ దేశానికి యువతే వెన్నుముక అని వివేకానందుడు బలంగా విశ్వసించేవారన్నారు. యువతలో చైతన్యం నింపాలనే సంకల్పంతో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశానికి వెన్నుముకగా నిలవాల్సిన యువత ఇటీవల కాలంలో దురదృష్టవసాత్తు వ్యసనాలకు బానిసలవుతున్నారన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల గంజాయి కేసుల్లో అరెస్టు అయిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయిని వినియోగించినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని, ఏదో ఒక రోజు జైలుకు పోకతప్పదని యువతను తీవ్రంగా హెచ్చరించారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 100/112 లేదా 1972కు సమాచారం అందించాలన్నారు.
అదే విధంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలను నడపొద్దన్నారు. ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. "అమ్మ మనకు జన్మనిస్తే, హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ప్రమాదాల్లో మరణిస్తే ఆ కుటుంబం చిన్నాభిన్నమై పోతుందన్నారు.
మైనరు బాలికలపై లైంగిక దాడులను నియంత్రించుటకు ప్రత్యేకంగా పోక్సో చట్టం ఉందన్నారు. మైనరు బాలికలపై ఎవరైనా లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబరు మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా భయపెడితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. యువత క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.
యువజనోత్సవాల్లో భాగంగా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న పలు ఎన్.జి.ఓ. ప్రతినిధులకు ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటిసి డి.మణికుమార్, ఎటికే స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు ఎం.డి. కరీముల్లా షరీఫ్, సామాజిక సేవా కార్యకర్తలు వెన్నెల చంద్రశేఖర్, బి.రాజశేఖర్, రచయిత ఇ.సురేష్, మై భారత్ డివైసి ఎం ప్రేమ్ భరత్ కుమార్, వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ట్రాఫిక్ సిఐ ఎస్.సూరి నాయుడు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

14
492 views