
పోలీస్ శాఖకు 'డ్రోన్' వితరణ: నేర నియంత్రణలో సాంకేతికతకు పెద్దపీట
జిల్లా పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా విజయనగరం శారదా సేవా సంఘం, జ్ఞాన సరస్వతి ఆలయం మరియు పశుపతినాదేస్వర స్వామి ఆలయం యాజమాన్యం సంయుక్తంగా ముందుకు వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ను జనవరి 9న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌కు అందజేశారు.
జిల్లా ఎస్పీ దామోదర్ సమక్షంలో శారదా సేవా సంఘం ప్రతినిధులు డ్రోన్ను అధికారికంగా జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా శారదా సేవా సంఘం ప్రెసిడెంట్ జి.శివ కుమార్, సెక్రటరీ సి.హెచ్.శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాస్, కమిటీ మెంబెర్స్ కుటుంబరావు, శ్రీనివాస్, నితిన్ మరియు గౌరినాయుడులను ఎస్పీ శాలువాతో సత్కరించారు.
అనంతరం జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ - డ్రోన్లను నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడిలో, ట్రాఫిక్ మానిటరింగ్, పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు మరియు బందోబస్తులలో విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజల భద్రతను మరింతగా బలోపేతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా పోలీసు శాఖకు అందించిన ఈ సహకారం అభినందనీయం అని దాతలను కొనియాడారు. వితరణ చేసిన డ్రోన్ ను ఎస్పీ వెంటనే విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావుకు అందచేసి, నేర నియంత్రణలో దీనిని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు.
దాతలు మాట్లాడుతూ – విజయనగరం జిల్లా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, సామాజిక బాధ్యతలో భాగంగా పోలీసు శాఖకు డ్రోన్ అందజేయడం గర్వంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో ఈ తరహాలో మరింత సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు మరియు ఇతర పోలీసు అధికారులు, శారదా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.