logo

ఇడితో మమత ఢీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం కేంద్రం పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)పై తీవ్రస్ఖాయిలో విరుచుకుపడ్డారు.
ఇడి దురుసుగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ టిఎంసి అధికారిక అంతర్గత డాటాను తస్కరించడానికి యత్నిస్తోందని ఆరోపించారు. గురువారం ఉదయం నుంచి రాజధాని కోల్‌కతాలో భారీ స్థాయిలో రాజకీయ వేడి రగులుకుంది. టిఎంసికి చెందిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత సమాచార విభాగం (ఐటిసెల్) ఐ ప్యాక్ ఛైర్మన్ ప్రతీక్ జైన్ నివాసంపై ఇడి సోదాలపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో అక్కడ తనిఖీలు జరుగుతూ ఉండగానే , అధికారుల బృందాలు ఫైళ్లు తిరగేస్తూ ఉన్న దశలోనే మమత అక్కడికి చేరుకుని సంచలనానికి దిగారు. తమ పార్టీకి చెందిన అంతర్గత పత్రాలు, హార్డ్ డిస్క్‌లను , రహస్య సమాచారాన్ని టచ్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అని అడుగుతూ, వాటిని ఎత్తుకెళ్లాలనుకుంటున్నారా? అని నిలదీశారు. ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించి ఐటి సెల్‌లో ప్రత్యేకంగా ఉండే కీలక సమాచారం స్వాధీనం ఎంత వరకూ సబబు అని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైన్‌కు చెందిన నివాసాలలో ఐటి దాడులు రాజకీయ కక్షలతో కూడినవి.రాజ్యాంగ వ్యతిరేకం, రాష్ట్రాలను అణచివేసే కుట్రలో భాగం అని విమర్శించారు. జైన్ నివాసానికి నగర పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ

చేరుకున్న కొద్ది సేపటికే మమత తన పార్టీ వారితో అధికారులతో కలిసి ఇక్కడికి చేరారు. అక్కడ దాదాపు 25 నిమషాలు ఉన్నారు. ఆ తరువాత ఆమె చేతిలో ఓ ఆకుపచ్చ ఫైలు తీసుకుని విసవిస బయటకు వెళ్లారు. ఈ ఫైలును ఇడి వారి నుంచి తీసుకున్నారా? లేక నివాసంలో ఉన్న ఫైలును సేకరించి తీసుకువెళ్లారా? అనేది తెలియలేదు. ఇంతకూ ఈ ఫైలులో ఉన్నది ఏమిటనేది తెలియచలేదు. తమ పార్టీ ఐటి సెల్ విభాగం ఇన్‌ఛార్జీ ఇంటిపై ఇడి దాడులకు దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కీలక ఫైలును తాను తీసుకువెళ్లుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇడి వర్గాలు తమ పార్టీ హార్డ్ డిస్క్‌లు తీసుకువెళ్లారని , దీనిని వారు ఎత్తుకుని వెళ్లినట్లుగా తాను భావిస్తున్నానని విమర్శించారు. కీలక ఫైళ్లు వారి బారిన పడకుండా తాను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో పార్టీ ఎన్నికల వ్యూహాల వివరాలు ఉన్నాయని చెప్పారు. ఇడికి దీనితో ఏం పని అని ప్రశ్నించారు. తమ పార్టీని వేధించేందుకు, తనపై బురదచల్లేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇడి సాయంతో ఈ విధంగా ఆగడాలకు దిగారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అరాచకపు హోం మంత్రిని ప్రధాని మోడీ అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుందని చురకలు పెట్టారు. దేశాన్ని రక్షించలేని హోం మంత్రి , ప్రతిపక్ష పార్టీలపై ఎన్నికలకు ముందు ఈ విధంగా దగుల్బాజీ చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.

హైటెన్షన్... రాజకీయ వేడి వాడి

ఇడి దాడులు, మమత అక్కడికి దూసుకువెళ్లడంతో కొల్‌కతాలో తీవ్ర స్థాయి ఉత్కంఠత ఏర్పడింది. రాజకీయ టెన్ష:న్ పెరిగింది. మమత ఇక్కడికి వచ్చి విధుల్లో ఉన్న ఇడి వర్గాలను బెదిరించారని, కీలక రహస్య ఫైలును వెంట తీసుకువెళ్లారని, ఇది బెదిరింపు రాజకీయాలకు పరాకాష్ట అని బెంగాల్ బిజెపి విమర్శించింది. రాష్ట్ర బిజెపి నాయకత్వం తనపై రాజకీయ వేధింపులకు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందనే మమత వాదనను బిజెపి నేతలు ఖండించారు. ఎవరి ధోరణి ఏమిటనేది జనం తెలుసుకుంటున్నారని, అధికార యంత్రాంగ విధుల నిర్వహణను అడ్డుకునే సిఎం ప్రజలకు ఏం జవాబు చెపుతారని బెంగాల్ అసెంబ్లీలో బిజెపి పక్ష నాయకుడు సువేంధు అధికారి మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థల పనిలో ముఖ్యమంత్రి జోక్యం రాజ్యాంగ ద్రోహం అవుతుందని విమర్శించారు. నగర పోలీసు కమిషనర్‌తో కలిసి సిఎం అక్కడికి వెళ్లి బెదిరించడం రాజకీయ అరాచకం అని వ్యాఖ్యానించారు. ప్రతీక్ జైన్ టిఎంసి ఐటి సెల్ ఇన్‌చార్జి. పైగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐ పిఎసి ) వ్యవస్థాపకులలో ఒకడిగా ఉన్నాడు. లోక్‌సభ ఎన్నికల దశలో ఈ కన్సల్టెన్సీ సంస్థ టిఎంసి కోసం , బెంగాల్ ప్రభుత్వం కోసం పనిచేసింది. ఈ సంస్థపై ఇప్పుడు ఇడి దాడులు సోదాలు తీవ్రస్థాయి దుమారానికి దారితీశాయి.

దర్యాప్తులో సిఎం జోక్యం, బెదిరింపు: హైకోర్టుకు ఇడి వివరణ

తాము విధి నిర్వహణలో ఉండగా ఆటంకాలకు దిగుతూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని ఇడి స్పందించింది. గురువారం తమ సోదాల దశలో సిఎం మమత బెనర్జీ ఇతరులతో కలిసి అక్కడికి రావడాన్ని ప్రస్తావించారు. విధులకు ఆటంకాల పిటిషన్ వేయడానికి తమకు అనుమతిని ఇవ్వాలని బెంగాల్ హైకోర్టులో ఇడి గురువారం తక్షణ అనుమతికి దరఖాస్తు చేసుకుంది. ఇడి తరఫు లాయరు ఈ విషయాన్ని జస్టిస్ సువ్రా ఘోష్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ దర్యాప్తునకు అత్యంత పలుకుబడి గల వ్యక్తులు లేదా స్థానిక అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉందని , సంబంధిత పిటిషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి తాము సోదాలు జరుపుతున్న చోటికి వచ్చి, అత్యంత కీలకమైన ఫైళ్లను, కొన్ని హార్డ్ డిస్క్‌లను, లాప్‌టాప్‌లను తీసుకువెళ్లారని వివరించారు. చాలా పత్రాలు లేకుండా చేశారని కూడా హైకోర్టుకు తెలిపారు. తాము వారిస్తూ ఉన్నా వినకుండా స్థానిక పోలీసు , అధికార యంత్రాంగం దురుసుగా వ్యవహరించి పత్రాలను తీసుకువెళ్లిందని వ్యాఖ్యానించారు.

2
78 views