
కొవ్వూరు గ్రామ ప్రజల ఆవేదన: రాయి క్వారీ లారీల వలన రహదారులు నాశనం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామ శివారులో ఉన్న రాయి క్వారీ నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో అతి భారీ లోడింగ్ లారీలు రోడ్ల మీదుగా సంచరిస్తున్నాయి. ఈ లారీల వలన గ్రామ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులపై పెద్ద పెద్ద గోతులు, పగుళ్లు ఏర్పడి, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షాకాలంలో ఈ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారి, ప్రమాదాలకు దారి తీస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ ప్రజలు ఇప్పటికే అనేకసార్లు ఈ సమస్యపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు సార్లు పత్రికల్లో, టీవీ ఛానళ్లలో కూడా రిపోర్టులు వచ్చినప్పటికీ అధికారులు నిమ్మకు నీళ్లు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ప్రత్యేకించి, ఈ భారీ లారీల వలన పాఠశాల విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు స్కూల్ బస్సులు కూడా మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన ఘటనలు ఉన్నాయి. ప్రజలు భయంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు వెనుకాడుతున్నారు.గ్రామ పెద్దలు, యువతీయువకులు, రైతులు కలిసి అధికారులు తక్షణం స్పందించి రాయి క్వారీ లారీ సంచారాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం రోడ్ల మరమ్మతులు చేయాలని, లారీలకు తగిన బరువు పరిమితి విధించాలని ప్రజలు కోరుతున్నారు. “ప్రజల భద్రత కంటే లాభం ముఖ్యం అనే తీరును అధికారులు వదిలి, గ్రామస్థుల పక్షాన నిలవాలని” కొవ్వూరు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.“ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం” అని వారు హెచ్చరిస్తున్నారు.