
సీతం కళాశాలలో ముగిసిన బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్: క్రీడాకారుల ఉత్సాహభరిత ప్రదర్శన!
స్థానిక సీతం కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజులపాటు జరిగింది. ఈ క్రీడలు బాలుర విభాగంలో వాలీబాల్, క్రికెట్, బాడ్మింటన్, అథ్లెటిక్స్, బాలికల విభాగంలో ఖోఖో, బాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.వి. రామమూర్తి ఒక ప్రకటనలో సోమవారం తెలియజేశారు. ఈ పోటీలలో కళాశాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ విజయనగరం ఎ. కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో యువత పాత్ర ఏమిటి, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలి, ప్రస్తుతం అన్ని రంగాలలో గవర్నమెంట్ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి తగినట్లు ఎలా నడుచుకోవాలి, ఆరోగ్యంపై శ్రద్ధ, క్రీడల అవసరం, ప్రస్తుతం క్రీడల ఉపయోగాలు, పై స్థాయిలో క్రీడల గుర్తింపు ఎలా ఉంటుందో తెలియజేస్తూ, క్రీడలలో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు.
కళాశాల సంచాలకులు మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ కళాశాల విద్యార్థి విద్యార్థులకు క్రీడలతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలియజేస్తూ, ముఖ్య అతిథికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సత్కరించారు. ఈ క్రీడాభివందన సభలో విజయ దుర్గ యూత్ సొసైటీ కె. చంద్రిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ విభాగాధిపతి రాధా, మెకానికల్ విభాగాధిపతి సిహెచ్ వెంకటలక్ష్మి, మొదటి సంవత్సరం విభాగాధిపతి కె. శ్రీలత, డిప్లొమా కోఆర్డినేటర్ అనిల్ గాంధీ, సిఎస్సీ సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్లు జె. మహేశ్వరరావు, టి. శ్రీదేవి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.