
*ఆరికతోట గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం నేలకూల్చివేత: హిందూ భక్తుల్లో ఆగ్రహం*
విజయనగరం జిల్లా, జనవరి 5, 2026: బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, ఆరికతోట గ్రామంలో గడచిన 15 సంవత్సరాలుగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నేలకూల్చిన సంఘటన హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై గ్రామస్థులు, ముఖ్యంగా యువత తీవ్రంగా స్పందించారు.
గ్రామంలోని ఈ విగ్రహం భక్తులకు ఆధారమై, రక్షణా స్వరూపమైన అభయ ఆంజనేయస్వామి రూపంలో దర్శనమిస్తూ వచ్చింది. కానీ రియల్ ఎస్టేట్ వ్యవసాయ అవసరాల కోసం ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ యువకుడు కనకల శ్యామ్ మాట్లాడుతూ, ఈ "సంఘటన హిందూ బంధువులందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. గడచిన 15 ఏళ్లుగా ఉన్న స్వామివారి విగ్రహాన్ని నేలకూల్చిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. మా పోరాటానికి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. త్వరలోనే న్యాయం జరిగి, స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని భక్తులు ఆశిస్తున్నారు.