
చిన్న పత్రికల పట్ల వివక్ష వద్దు: కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల నిరసన
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పత్రికల ప్రతినిధులు తమ నిరసనను వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జిల్లాలో ఉన్న చిన్న మధ్యతరహా పత్రికల రిపోర్టర్లకు కవరేజ్ చేసేందుకు పిలుపు రాకపోవడం ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులను విస్మరించి, ఇతర జిల్లాల నుంచి కవరేజ్ కోసం పిలవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంలోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ చిన్న పత్రికల పట్ల వివక్ష చూపవద్దని, అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రెస్ నోట్‌లు సమాచార శాఖ నుంచి చాలా ఆలస్యంగా అందుతున్నాయని, దీనివల్ల వార్తలను సకాలంలో కవర్ చేయడం కష్టమవుతోందని వారు పేర్కొన్నారు. సమాచార శాఖ స్పందించి ప్రెస్ నోట్‌లను త్వరగా పంపాలని కోరారు.
మంత్రి, కలెక్టర్ సానుకూల స్పందన
చిన్న పత్రికల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాలపై తక్షణమే సమాచార శాఖ అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ నోట్‌లు సకాలంలో అందేలా చూస్తామని, స్థానిక చిన్న పత్రికల మనుగడకు మరియు ప్రాధాన్యతకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాధాకృష్ణ, శివ ప్రసాద్, పంచాది అప్పారావు, కె జె శర్మ, ఎం.ఎస్.ఎన్.రాజు, మంత్రి ప్రగడ రవికుమార్, సముద్రాల నాగరాజు, బి.శంకర్రావు, ఆచారి, రాజేష్ పట్నాయక్, శెట్టి గోవిందరావు, సూర్య పాత్రో, జి.శివ, భరత్, అల్లడ రమణ తదితరులు పాల్గొన్నారు.