
హిందూ ఎస్ఐ సంతోష్‌ను చంపింది నేనే".. యూనస్ పాలనలో అరాచకం..
బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని హత్య చేయడంతో పాటు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా, ఆనాటి అరాచకాలకు మతోన్మాద విద్యార్థి నేత హిందూ ఎస్‌ఐని చంపినట్లు నిర్భయంగా ప్రకటించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
2024లో పాలన మార్పు ఆపరేషన్ సమయంలో సంతోష్ చౌదరి అనే హిందూ ఎస్ఐని హత్య చేశారు. ఈ హత్య గురించి బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి గొప్పుగా చెప్పుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోను జర్నలిస్ట్ సాహిదుల్ హసన్ ఖోకోన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ముస్లిం వ్యక్తి మేము బినాయాచాంగ్ పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టాము, మేము ఎస్ఐ సంతోష్‌ను చంపాము అని గొప్పగా చెప్పడం వినిపిస్తుంది. "నన్ను గుర్తుపట్టలేదా? హిందూ సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను సజీవంగా కాల్చి చంపింది నేనే. 2024 ఆగస్టులో జరిగిన అల్లర్ల సమయంలో బనియాచోంగ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టింది కూడా నేనే!" అని ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో చెప్పుకున్నాడు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను గద్దె నుంచి దించేయడం, ఆ తర్వాత అనేక మంది హిందువులను హత్య చేయడం వంటివి చేయడంలో సమన్వయ కర్తగా ఉన్నానని హబీగంజ్‌కు చెందిన విద్యార్థి నేత అంగీకరించాడు. ఒక అధికారిని చంపిన వ్యక్తి ధైర్యంగా ప్రకటించుకోవడం చూస్తే, ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిందూ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా, దానిని ధైర్యమైన చర్యగా ప్రకటించుకున్నాడు.
సంతోష్ చౌదరి బంగ్లాదేశ్‌లో హబీగంజ్ జిల్లాలోని బనియాచాంగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేశారు. ఆగస్టు 5, 2024న, అతన్ని ముస్లిం గుంపు కొట్టి చంపింది. తీవ్రవాదులు హిందూ పోలీసు అధికారిని బలవంతంగా తీసుకెళ్లి, కొట్టి చంపారు. ఆ తర్వాత అతడిని పోలీస్ స్టేషన్ సమీపంలోని చెట్టుకు వేలాడదీశారు. దారుణహత్యకు 10 నెలల ముందే ఆయనకు వివాహం జరిగింది. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత సంతోష్‌కు కుమారుడు జన్మించారు.