logo

చమ్మచింత హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని చమ్మచింత ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యా మూర్తి సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరిపారు.కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఎస్.ఆర్. ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, స్త్రీ విద్యావ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాట్లాడుతూ, “సావిత్రిబాయి పూలే సమాజంలో మహిళలకు చదువు లేకపోయిన రోజుల్లో విద్యకు మార్గం చూపిన మహానుభావురాలు. ఆమె చూపిన దారిలో నేటి బాలికలు, విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి” అని తెలిపారు. విద్యార్థులు కృషితో చదువుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అప్పన రాంబాబు మాట్లాడుతూ, “భారతీయ సమాజంలో స్త్రీలకు విద్యా అందని కాలంలో భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి, తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన సావిత్రిబాయి పూలే ధైర్యాన్ని, తపనను అందరం ఆదర్శంగా తీసుకోవాలి,” అని అన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులు రూతు కుమారి, భువనేశ్వరి, అర్జవతిలను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, నానిబాబు, మత్స్యరాజు, శివ సత్యనారాయణ, రాజేష్‌కుమార్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సీఆర్పీ గోవిందు పర్యవేక్షించారు.విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవితం ఆధారంగా వ్యాసరచన, పద్యరచన, ప్రసంగ పోటీలలో చురుకుగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేయడం తో పాఠశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో మార్మోగింది.

2
1067 views