
నర్సీపట్నంలో భారీ గంజాయి నిర్మూలన అవగాహన ర్యాలీ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. గంజాయి నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి. గోపినాథ్ ఐపీఎస్ స్ఫూర్తితో కొనసాగుతున్న “అభ్యుదయ ప్రోగ్రాం”లో భాగంగా నర్సీపట్నంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పరిధిలోని వివిధ కళాశాలల నుండి సుమారు 2,000 మంది విద్యార్థులు పాల్గొని "సే నో టు డ్రగ్స్" అంటూ నినాదాలు చేశారు.ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి, అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద సమావేశం గా ముగిసింది. కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ భరణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల ముప్పు నుంచి యువత దూరంగా ఉండాలని, గంజాయి వంటి పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవనాన్ని మాత్రమే కాకుండా, కుటుంబం మరియు సమాజాన్ని దెబ్బతీస్తుందన్నారు.ఆ తరువాత నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, అభ్యుదయ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఆయన వివరించిన ప్రకారం, 2025 సంవత్సరంలో వైజాగ్ రేంజ్ పరిధిలో 129 కేసులు నమోదు చేసి, 423 మందిని అరెస్టు చేసి, 8,864 కేజీల గంజాయి, 7 లీటర్ల లిక్విడ్ గంజాయి, 118 వాహనాలను సీజ్ చేశారు.ఈ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు 5,032 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 1.68 లక్షలమంది విద్యార్థులు, 1.22 లక్షలమంది గ్రామీణ ప్రజలకు గంజాయి దుష్ప్రభావాలు పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. నర్సీపట్నంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, డ్రోన్లు, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లు ద్వారా పర్యవేక్షణ బలోపేతం చేశామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్, రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, పాయకరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ పాల్గొన్న కళాశాలల నిర్వాహకులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.