logo

*నగరి శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో శివగామి సమేత శ్రీ నటరాజ స్వామి, మాణిక్యవాసర్ స్వామి వారికి వైభవంగా ఆరుద్ర అభిషేకం**

**నగరి శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో
శివగామి సమేత శ్రీ నటరాజ స్వామి, మాణిక్యవాసర్ స్వామి వారికి వైభవంగా ఆరుద్ర అభిషేకం**
నగరి నియోజకవర్గం, నగరి పట్టణంలో వెలసివున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివగామి సమేత శ్రీ నటరాజ స్వామి మరియు మాణిక్యవాసర్ స్వామి ఉత్సవమూర్తులకు ఘనంగా ఆరుద్ర అభిషేకం నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఆరుద్ర అభిషేకంలో గంగా జలం, పాలు, పెరుగు, చందనం, విభూతి, కుంకుమ, తేనె, పంచామృతం, యన్నీరు, పన్నీర్, వివిధ రకాల పండ్లతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కలకండు, చక్కెర, ముందిరి, ఎండు ద్రాక్ష, బాదం పప్పు తదితర ద్రవ్యాలతో కనకాభిషేకం, స్వర్ణాభిషేకం, కళశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది.
తదనంతరం దూపదీప నైవేద్యాలు, మహా హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం అంతా “ఓం నమఃశివాయ” నామస్మరణతో మారుమ్రోగి, భక్తులు పరవశంతో శివానుభూతిని అనుభవించారు.
శనివారం ఉదయం శివగామి సమేత శ్రీ నటరాజ స్వామి, మాణిక్యవాసర్ స్వామి వారికి వివిధ రకాల సువాసన పుష్పములతో అలంకరణ చేసి ఆలయం ముందు శిఖర దర్శనం నిర్వహించారు. అనంతరం ఆలయం లోపల భక్తులకు శివగామి సమేత నటరాజ స్వామి, మాణిక్యవాసర్ స్వామి తాత్త్వికతను అర్చకులు విశదీకరించారు.
ఈ సందర్భంగా శివగామి అమ్మవారు మరియు నటరాజ స్వామి మధ్య భరతనాట్యంలో జరిగిన తాత్త్విక ఘట్టం, అమ్మవారు అలిగి వెళ్ళిన సందర్భంలో మాణిక్యవాసర్ స్వామి మధ్యవర్తిత్వంతో శివ–శక్తి ఐక్యత సాధించిన విధానంను భక్తులకు ఉదాహరణలతో వివరించారు. ఇది కుటుంబంలో కలిగే మనస్పర్థలను పెద్దలు సర్దిచెప్పి కలిపినట్లే, మాణిక్యవాసర్ స్వామి శివ–శక్తులను ఐక్యం చేసిన మహత్తర భక్తి భావనగా అర్చకులు వివరించారు.
తదనంతరం శివపురాణ కథా ప్రవచనం అనంతరం దూపదీప నైవేద్యం, మహా హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, ఉభయదారులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆరుద్ర దర్శనం – ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఆరుద్ర దర్శనం శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. మార్గశిర (మార్గళి) మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు శివుడు నటరాజ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన దినంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ తాండవం సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీక.
నటరాజ స్వామి రూపంలో ఉన్న డమరుకం సృష్టిని, అగ్ని లయను, అభయ హస్తం రక్షణను, పైకెత్తిన పాదం మోక్షాన్ని సూచిస్తే, పాదాల కింద అపస్మార పురుషుడు అజ్ఞానం నాశనానికి సంకేతం. శివగామి అమ్మవారు శక్తి స్వరూపంగా శివుడితో ఐక్యతను చాటుతారు.
ఆరుద్ర దర్శనం రోజున శివ దర్శనం చేయడం వల్ల పాపక్షయం, ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం. మాణిక్యవాసర్ స్వామి రచించిన తిరువాచకం శివభక్తికి పరాకాష్ఠగా నిలుస్తూ ఈ రోజున ప్రత్యేకంగా పఠించబడుతుంది.
నగరి శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ఆరుద్ర మహోత్సవం భక్తుల హృదయాలను శివానందంతో నింపి, దైవానుభూతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

0
796 views