logo

దేవరాపల్లి‌లో కల్తీ మద్యం కలకలం రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: సిపిఎం

దేవరాపల్లి,: మండల కేంద్రం దేవరాపల్లిలో కల్తీ మద్యం విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించిన ముగ్గురు అకస్మాత్తుగా మృతి చెందారు. మృతులు గోకాడ శ్రీను, అల్లూ అప్పారావు, షేక్ దర్గా గా గుర్తించినట్లు స్థానిక సమాచారంతో తెలిసింది. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో దేవరాపల్లి మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా కల్తీ, అక్రమ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని ప్రతి గ్రామంలో కిల్లి కొట్లలో, పాన్ షాపుల్లో, లైసెన్సులు లేని దాబాల్లోనూ బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. చిన్న పిల్లలు, మహిళలు నిత్యం సంచరించే రహదారుల పక్కనే బెల్ట్ షాపులు పెట్టడం చట్టాన్ని వేలెత్తి చూపడమేనని వ్యాఖ్యానించారు. బెల్ట్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిటైల్ ధరల కంటే ఒక్క బాటిల్‌పై రూ.50 నుంచి 100 వరకు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో మద్యం విక్రయ హక్కుల పేరుతో లక్షల్లో అనధికారిక వేలం పాటలు నిర్వహించి బెల్ట్ షాపుల యజమానులు సొమ్ములు చేసుకుంటున్నారని, అక్రమ అమ్మకాల బారిన పడింది పేదలు, కూలీలేనని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం అలవాటుతో యువత పెద్దఎత్తున బానిసలవుతుండగా, మద్య ప్రభావంతో మహిళలు, మైనర్ బాలికలపై నేరాలు, గ్రామాల్లో గొడవలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ప్రకారం మద్యం దుకాణాలు గ్రామాల నుంచి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని, పాఠశాలలు, దేవాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి ప్రదేశాల సమీపంలో దుకాణాలు నడపకూడదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మద్యం దుకాణాలు కనీసం కిలోమీటరు దూరం వరకూ ఉండేవని, ఇప్పుడు లాభాల కోసం నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే బెల్ట్ షాపులు తెరిచి ఉంచడంతో అక్కడ పదుల సంఖ్యలో మందుబాబులు బార్లుతీరుతున్నారని, దీంతో ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకల పేరుతో దేవరాపల్లిలో కల్తీ మద్యం సేవించిన ముగ్గురు మృతి చెందినా, బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్య విధానమే అవలంబిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అక్రమ బెల్ట్ షాపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్సులు లేని దుకాణాలు, దాబాలు, పాఠశాలలు, గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్, మహిళలు,బాలికలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లి ఘటనలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని వెంకన్న కోరారు.

6
822 views