logo

డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం: యువతకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపు! -విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్


మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని పాయకరావుపేట నుండి ఇచ్ఛాపురం వరకు సాగిన అభ్యదయ సైకిలు యాత్ర నేటితో ముగియనుండడంతో సంఘీభావంగా జిల్లాలో 3 కి॥మీ॥ల 'వాక్ థాన్'ను నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 3న తెలిపారు. విజయనగరం పట్టణం బాలాజీ జంక్షను నుండి మూడు లాంతర్లు వరకు నిర్వహించిన 'వాక్ థాన్' జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, వాక్ థాన్ ను ప్రారంభించి, వాక్ థాన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరాలించాలనే సంకల్పంతో రేంజ్ ఐజిపి గోపీనాథ్ జట్టి రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాలను కవర్ చేస్తూ 'అభ్యుదయ సైకిలు యాత్ర'ను నిర్వహించారన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కవర్ చేస్తూ నిర్వహించి, ప్రజలు, యువతకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాల పట్ల చైతన్యపర్చామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ముగింపుకు చిహ్నంగా జిల్లాలో 'వాక్ థాన్' నిర్వహించామన్నారు.
చాలామంది యువత తెలిసి తెలియని వయస్సులో కుతూహలంతోను, తోటి స్నేహితుల ఒత్తిడితోను డ్రగ్స్ను వినియోగించి, వాటికి బానిసలుగా మారుతూ, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ ప్రభావం వాటిని వినియోగించే వ్యక్తుల ఆరోగ్యంపైనే కాకుండా, వారి కుటుంబ బంధాలు, అనుబంధాలు పైనా ప్రభావం చూపుతుందన్నారు. అంతేకాకుండా, డ్రగ్స్ ప్రభావంతో నిర్దేశించుకన్న లక్ష్యాలను చేరుకోలేరని, వృత్తి, చదువు, మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతుందనీ, ఆర్ధిక ఇబ్బందులకు గురికావడం, నేరస్థులుగా మారే పరిస్థితులను కల్పిస్తుందన్నారు.
కావున, జీవితాలను అంధకారంలోకి నెట్టేసే ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ జోలికి పోవద్దని యువతకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాలను (డ్రగ్స్) వినియోగించినా, విక్రయించి, రవాణకు పాల్పడినా చట్టాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదవ్వడంతో చిక్కులు తప్పవని, చివరకు శిక్షలకు గురైతే జీవితాలు నాశనం అవుతాయన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి, వ్యవహరించాలన్నారు.
గత కొన్ని మాసాలుగా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా చేయూతను అందించాలని, మీ స్నేహితులు, బంధువులకు డ్రగ్స్ దుష్ప్రభావాలను వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు అందుకోవాలని, విజయనగరం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, టి.శ్రీనివాసరావు, సిహెచ్.సూరి నాయుడు, బి.లక్ష్మణరావు, ఈ.నర్సింహమూర్తి, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

5
310 views