సహకార రంగం బలోపేతమే లక్ష్యం
శ్రీకాకుళం : సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.బుధవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'అంతర్జాతీయ సహకార సంవత్సరం - రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025' ముగింపు వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ముగింపు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌కు సిక్కోలు డ్వాక్రా బజార్ నిర్వహణకు నాబార్డ్ నుంచి రుణ సహాయాన్ని అందించారు. కార్య క్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, నాబార్డ్ సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, మూడు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, శివ్వాల సూర్యనారాయణ, తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, నాబార్డ్ ప్రతినిధి డీవీఎస్ వర్మ, డీసీసీబీ సీఈఓ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు.