logo

కేసులు తగ్గాయి.. హత్యలు పెరిగాయి

శ్రీకాకుళం:జిల్లాలో క్రైమ్‌ రేటు తగ్గిందని, కానీ గతంలో కంటే హత్యలు, హత్యాయత్నాలు పెరిగాయని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర వార్షిక గణాంకాలు వెల్లడించారు. సైబర్‌క్రైమ్‌ డిటెన్షన్‌, జాబ్‌ఫ్రాడ్స్‌ వంటి అంశాల్లో మెరుగుపడాలని, కొత్తగా బృందాలు వేసి ఫలితాలు సాధించాల్సి ఉందని చెప్పారు. 2024లో 9555 కేసులు నమోదైతే ఈ ఏడాది 6314 నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై వేధింపులు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

హత్యల్లో టాప్‌..

గత ఏడాది జిల్లాలో 17 హత్యలు జరగ్గా.. ఈ ఏడాది 26 హత్యలు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నా రు. మరికొన్ని దర్యాప్తు దశలో ఉన్నాయన్నారు. వీటితో పాటు హత్యాయత్నం కేసులు కూడా 22 నమోదైనట్లు చెప్పారు. వీటిలో చాలా వరకు కుటుంబ తగాదాల వల్లనే జరిగాయని వివరించారు. పోక్సో కేసులు కూడా 54 నమోదయ్యాయన్నారు.

మహిళలకు వేధింపులు

మహిళలకు సంబంధించి ఈ ఏడాది 482 కేసులు నమోదు కాగా.. అందులో 333 వేధింపుల కేసులే ఉన్నాయన్నారు. అటెంప్ట్‌ రేప్‌ ఒకటి ఉండగా, ఎలోప్‌మెంట్‌ రేప్‌లు 9 ఉన్నాయని, వరకట్న హత్యలు 2, ప్రేరేపిత ఆత్మహత్యలు 4 ఉన్నాయని

పేర్కొన్నారు. అవమానించినవి 130 ఉండగా ఈ ఏడాది 51 మంది బాలికలు, 214 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై ఇద్దరు హత్యాయత్నంకు పాల్పడగా, 8 మంది దళిత మహిళలపై లైంగిక దాడి జరిగినట్లు కేసులు నమోదుయ్యాయన్నారు. ఎస్సీ మహిళలను అవమానించినవి 6, అదర్‌ ఐపీసీ 22 కేసులు నమోదయ్యాయన్నారు.

ప్రాపర్టీ నేరాల్లో

ఈ ఏడాది మొత్తం 396 కేసుల్లో 281 ఛేదించి 260 మంది నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,69,09,869లు స్వాధీనం చేసుకున్నారు. 2025 కంటే ముందు చేసిన నేరాలను ఈ ఏడాదిలో ఛేదించామన్నారు.

కొత్త ఏడాది లక్ష్యాలివే..

అల్లర్లు సృష్టించే రౌడీ, సస్పెక్ట్‌, హిస్టరీ షీటర్లకు జియోట్యాగింగ్‌ చేస్తామని, ఆపదలో ఆదుకునేలా 112 కాల్స్‌ వస్తే 5 నిమిషాల్లో చేరేలా టార్గెట్‌ పెట్టుకున్నామని, ప్రజలు, పోలీసులు, ఆర్గనైజ్‌ సంస్థలు సౌజన్యంతో 3700 సీసీ కెమెరాలు పెట్టామని, మరో 1100 కెమెరాలు క్రైమ్‌స్పాట్‌లకు అవసరం ఉన్నాయని తెలిపారు. రహదారి భద్రతా విషయంలో హెల్మెట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తామని, వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తామని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌, ఎన్డీపీఎస్‌(గంజా), గ్యాంబ్లింగ్‌పై మరింత కఠినతరంగా వ్యవహరించి జైలు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ చెప్పారు.

0
0 views