logo

శ్రీకాకుళం రిమ్స్‌లో సిబ్బంది లంచాల పర్వం..

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం ఉదయం రిమ్స్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను రెండు రోజుల క్రితం రిమ్స్‌కు తీసుకురాగా వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స(కొండనాలుక వ్యాధి) పూర్తయ్యాక ఐసీయూలో ఉంచారని తెలిపారు.

అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు తరలించిన వారు సైతం డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లలో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. కొందరు సిబ్బంది, వైద్యులు వచ్చి బయటకు వెళ్లి చికిత్స చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త పోలీస్‌ శాఖలో పని చేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్‌లో సిబ్బంది పనితీరు అసలు బాగలేదని, ప్రతిదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. సుమారు అరగంటకు పైగా ఆమె ఆస్పత్రి వద్ద బైఠాయించగా.. సూపరింటెండెంట్‌ ప్రసన్నకుమార్‌ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకువెళ్లారు. సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై గురువారం విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ 'సాక్షి'కి తెలిపారు.

0
24 views