logo

ఎచ్చెర్లలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన 311 మందికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు

ఎచ్చెర్ల, డిసెంబరు 30: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో నిరుద్యోగులు కంపెనీల చుట్టూ తిరిగితే ఇప్పుడు కంపెనీలే మీ వద్దకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఎచ్చెర్లలోని శ్రీ సాయి శిరీష డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 14 ప్రముఖ ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించగా, మొత్తం 621 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 311 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసి, వారికి నియామక పత్రాలను అందజేశారు

ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ బి. శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ..వచ్చిన అవకాశం చిన్నదని, జీతం తక్కువని లేదా దూర ప్రాంతమని వెనకడుగు వేయక తొలి అడుగు వేస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని యువతకు దిశానిర్దేశం చేశారు. ఎంప్లాయిమెంట్ పోర్టల్‌లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కె. సుధ సూచించారు. యువతలో నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి. రమణమూర్తి వివరించగా, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ కోరారు. ఏ రంగంలో అవకాశం వచ్చినా దూరాన్ని లెక్క చేయకుండా చేరాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుబ్బిరెడ్డి, ఎన్.వై.కే డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్, సెట్ శ్రీ సీఈఓ అప్పలనాయుడు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, న్యూక్లియర్ పర్మనెంట్ చీఫ్ ఇంజనీర్ రవికుమార్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వర్ రావు, వివిధ ప్రజా ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

11
316 views