logo

పాతబస్తీ నుంచి సెట్విన్‌ ఔట్‌!

హైదరాబాద్ 28:
పాతబస్తీ నగర యువత కోసం ప్రత్యేకంగా స్థాపించిన ఉపాధి శిక్షణ కేంద్రం సెట్విన్‌ను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్థానిక యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
పాతనగర యువతకు వివిధ రంగాల్లో శిక్షణ కల్పించి ఉపాధి అందించేందుకు నాటి ప్రభుత్వం 1978లో సెట్విన్‌ను స్థాపించింది. అప్పటి నుంచి వివిధ దశల వారీగా సెట్విన్‌ శిక్షణ కేంద్రాలను నగరంతోపాటు పలు ప్రాంతాల్లో లకొల్పింది.

ప్రతి సంవత్సరం సెట్విన్‌ నుంచి సుమారు 60వేలకు పైగా వివిధ కోర్సుల్లో యువతకు శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నారు. ఏడో తరగతి ఉత్తీర్ణత నుంచి పదో తరగతి అభ్యసించిన యువతతో పాటు ఉన్నత స్థాయి విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు సైతం నేడు వివిధ సాంకేతిక కోర్సులను అందిస్తూ వారికి ఉపాధి అవకాశాలను సెట్విన్‌ అందిస్తున్నది. సెట్విన్‌ను విస్తరించాలని నిర్ణయించిన నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా నగర శివారుతోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ సెట్విన్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు సోలార్‌, మొబైల్‌ టెక్నాలజీ, బ్యూటీషియన్‌, ఎంబ్రాయిడరీ, ఫైధాన్‌, ఎంఎస్‌, తదితర ఉపాధి అవకాశాల్లో శిక్షణ ఇచ్చి వారి ఉన్నతికి బాటలు వేసింది.

అయితే సెట్విన్‌ కేంద్రాల విస్తరణ, ఉపాధి, మెరుగైన కోర్సుల ప్రవేశాలను పక్కన పెట్టిన ప్రభుత్వం.. మరో నిర్ణయం తీసుకున్నది. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలంటూ జీవో జారీ చేసింది. దరిమిలా సెట్విన్‌ ప్రధాన కార్యాలయం పాతనగర పురాణి హవేలీ నుంచి తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఇప్పటి వరకు ఉపాధి అవకాశాలు కల్పించి పాతనగరానికి కరదీపికలా ఉన్న సెట్విన్‌ కేంద్రం తరలిపోతుండడంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. శిక్షణ, ఉపాధి కల్పించే మణిదీపం వెళ్లిపోతే ఎక్కడో నగరంలో ఏర్పాటు కానున్న కేంద్రానికి వెళ్లడానికి ప్రయాణ వ్యయం అవుతుందంటున్నారు. స్థానిక యువత ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

చైర్మన్‌ సౌకర్యార్థమేనా..?

సెట్విన్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న గిరిధర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి బంధువు. ఆయనకు పాతనగరానికి రావడంలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సెట్విన్‌ కేంద్రాన్నే పాతనగరం నుంచి మార్చడానికి ఆ మంత్రి చక్రం తిప్పారని సమాచారం. మంత్రి పంతం నెగ్గించుకోవడానికి స్థానిక యువత లక్ష్యాలను గాలికి వదిలి సెట్విన్‌ కేంద్రాన్ని తరలిస్తున్నారని కొందరు సెట్విన్‌ అధికారులు వాపోతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సెట్విన్‌ మనుగడ కోసమే ప్రయత్నించారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ సెట్విన్‌ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంపై మండిపడుతున్నారు. చైర్మన్‌ సెట్విన్‌ కేంద్రానికి వచ్చేది కూడా ఆయనకు తీరక దొరికినప్పుడే.. కానీ.. రెండేండ్ల కాల వ్యవధిలో ఆయన వచ్చింది వేళ్లపై లెక్కవేసుకున్నన్ని సార్లు మాత్రమే అంటున్నారు.

పోరాటం చేస్తాం: బీఆర్‌ఎస్‌

సెట్విన్‌ కేంద్రాన్ని పాతనగరం నుంచి దూరం చేస్తే బీఆర్‌ఎస్‌ తరపున తీవ్ర పోరాటం చేస్తామని సీనియర్‌ నాయకులు సాయికిరణ్‌ హెచ్చరించారు. సెట్విన్‌ ఏర్పడినప్పటి నుంచి ఎంతో మందికి జీవన మార్గం చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన కేంద్రాన్ని తరలించేందుకు పాతనగర యువత అంగీకరించదన్నారు. నిరుద్యోగ యువతతో పాటు సెట్విన్‌ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.

0
0 views