
జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.
నంద్యాల (శుభోదయం న్యూస్): జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 29వ తేదీ సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో మొత్తం 7 రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్లినిక్స్‌లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి, వాటిని నమోదు చేసి, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందిన ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తారని తెలిపారు. రెవెన్యూ క్లినిక్స్‌ను ఈ విధంగా విభజించి నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు.
రెవెన్యూ క్లినిక్ – 1 : రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించిన సమస్యలు.
రెవెన్యూ క్లినిక్ – 2 : అడంగల్ సవరణలకు సంబంధించిన అంశాలు.
రెవెన్యూ క్లినిక్ – 3 : 22ఎ, చుక్కల భూముల క్రమబద్ధీకరణ సంబంధిత సమస్యలు.
రెవెన్యూ క్లినిక్ – 4 : అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించిన అంశాలు.
రెవెన్యూ క్లినిక్ – 5 : రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్‌ఓఆర్ కేసులు.
రెవెన్యూ క్లినిక్ – 6 : సర్వే, రీ-సర్వేకు సంబంధించిన సమస్యలు.
రెవెన్యూ క్లినిక్ – 7 : దేవాదాయ, వక్ఫ్ భూముల సమస్యలు.
ఈ రెవెన్యూ క్లినిక్స్‌లో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ప్రత్యేక అర్జీలను నేరుగా సమర్పించవచ్చని, అర్జీల స్వీకరణతో పాటు నమోదు ప్రక్రియ కూడా జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.