logo

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం.. గ్రామగ్రామాన గెలుపు జెండా ఎగరాలి: కొత్తపేట తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పిలుపు.

*2029 లోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం...*
*గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదు...*
*నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చెయ్యడం తథ్యం...*
*స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి...*
*కొత్తపేట తెదేపా మండల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*
కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడానికే సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా నియమితులైన ముత్యాల బాబ్జి,మీడియా కోర్డినేటర్ గా నియమితులైన రెడ్డి శ్రీనివాస్, ఆలయ పాలకమండలి తదితర పదవులు పొందిన వారిని ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలకు ఎదురునిల్చి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారని కొనియాడారు.వారందరికీ న్యాయం చేయాలనే తపన ఉందన్నారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. 2029లో సైతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా
రహదారులన్నీ చిన్నాభిన్నం అయ్యాయని, వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. పుష్కరాలు వస్తున్న సందర్భంగా దేవాలయాల అభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు. రూ. 4కోట్లతో మందేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. పలివెల ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, బిల్లకుర్రు శివాలయం నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న అందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి సాధ్యమైనంత మేర భారీ స్థాయిలో అందిస్తున్నామన్నారు. కొత్తపేటలో రెండు మూడు నెలల్లో సబ్ స్టేషన్ ప్రారంభించుకునే విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున ఒకేసారి రూ.60వేలు అందించడం జరిగిందన్నారు. ఎమ్ ఎస్ ఎమ్ ఈ సదస్సులు నిర్వహించామని డ్వాక్రా మహిళలు, యువత స్వయం ఉపాధికి సంబంధించిన ఆలోచన చేస్తే సబ్సిడీ రుణం అందేలా అవగాహన కోసం రావులపాలెం లో కార్యాలయం ఏర్పాటు జరిగిందన్నారు. నియోజకవర్గ కేంద్రం అయిన కొత్తపేట అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. డీఎల్డీవో ఆఫీసు వాడపాలెం సచివాలయంలో ఏర్పాటు చేశామన్నారు. డివిజనల్ ఆఫీసు కార్యాలయాల నిర్మాణానికి, తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బాగా కస్టపడినా కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ ఐక్యమత్యంతో కల్సి ముందుకు రావాలన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవాలన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించి ముందుకు వెళ్లాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పడితే స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేగా తనకు, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

2
145 views