logo

"వందేళ్ల విప్లవ ప్రస్థానం.. శతాబ్దపు పోరాట విజేత సి.పి.ఐ.": విజయనగరంలో ఘనంగా శత వార్షికోత్సవ ముగింపు వేడుకలు


భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ద కాలంగా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, కార్మిక కర్షకులకు అండగా ఉంటూ అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత సిపిఐ కి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు అన్నారు.
శనివారం ఉదయం విజయనగరంలో పి. డబ్ల్యూ మార్కెట్ లో సిపిఐ శత వార్షికోత్సవం వేడుకలు జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు సిపిఐ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ శత వార్షికోత్సవ సందర్బంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ పాలకుల నిర్బంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబరు 26న కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆవిర్భవించి గడిచిన 100 ఏళ్ళ కాలంలో ఎన్నో వీరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సీపీఐ ప్రతీకగా నిలిచిందని అన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టులను అరెస్టు చేసి మీరట్ కుట్ర కేసుల్లాంటి అనేక తప్పుడు కేసులు బనాయించి దశాబ్దాల పాటు జైళ్ళలో పెట్టారన్నారు. స్వాతంత్య్ర్యం తరువాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంటులో పనిచేసిందన్నారు..రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ ఫ్యాసిస్టుల శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందన్నారు. కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణం కమ్యూనిస్టుల లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం, మెరుగైన భారతదేశం కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతామని ఉద్ఘాటించారు. ఈ విప్లవాత్మక, సాహసోపేతమైన ప్రస్థానం ఇప్పుడు 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వేలాదిమంది కార్మికులను చైతన్యం చేసి స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ కె దక్కుతుంది అని ఆయన కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు జైలు జీవితం గడిపారని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసి దేశానికీ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని నినదించి ఆ పోరాటాలతోనే స్వాతంత్రం సాధించిందని అన్నారు. ఇప్పుడు అధికారం చాలయిస్తున్న మతోన్మాద బిజెపి ఆనాడు ఏ ఉద్యమాలు చేయకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఇప్పుడు అధికారం అనుభవిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతాల మధ్య చిచ్చుల పెడుతూ దేవుడి పేరుతో పబ్బం గడుపుకుంటూ కులాల పేరుతో గొడవలు పెడుతూ చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. ఆనాటి నుండి నేటి వరకు ఎర్రజెండా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో నిత్యం ప్రజా పోరాటంలో ఉండి, ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన కొనియాడారు. ఏడాది కాలంగా భారత దేశ వ్యాపితంగా జరుగుతున్న సిపిఐ శాతవాసంతాల వేడుకలు ముగింపు సందర్బంగా జనవరి 18 వ తేదీన లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో కార్మికులు అందరూ పాల్గొవాలి అని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. నాగభూషణం ముగింపు సందేశంతో కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా నాయకులు సి. హెచ్ చరణ్, హేమంత్, కెల్ల సూర్యనారాయణ, నడిపేన పాపునాయుడు, మజ్జి చిన్న, పతివాడ శ్రీను, చందక శ్రీను మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

3
609 views