logo

*సైబరు మోసాలు, డిజిటల్ అరెస్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండి* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*


సైబరు మోసాలు పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 24న పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - సైబరు నేరాలకు పాల్పడే మోసగాళ్ళు ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగు వివరాలు, ఓ.టి.పి.లు, సివివి, పాస్వర్డులు లాంటి అంశాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటిని ఎప్పుడు ఇతరులతో పంచుకోవద్దని, గోప్యత పాటించాలన్నారు. ప్రజల ఆసక్తిని గమనించి, సైబరు నేరగాళ్ళు వారి మొబైల్స్కు కొన్ని లింకులు, ఎపికే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్, సందేశాలను, ఈ-మెయిల్స్ను పంపి, వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారన్నారు. అదే విధంగా ఆన్లైన్ లోన్ యాప్ ల వైపు వెళ్ళవద్దని ప్రజలను కోరారు. డిజిటల్ యుగంలో ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్లు, ప్రభుత్వ నెట్వర్క్స్ వంటి వాటిపై హ్యాకింగ్, ఫిషింగ్, మాల్వేర్, ర్యాన్సమ్వేర్ వంటివి సైబరు నేరగాళ్ళు పంపి సైబరు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ దాడులను నియంత్రించేందుకు ప్రజలు సైబరు మోసాలు పట్ల అవగాహన పెంచుకోవాలని, హ్యాకింగుకు గురికాని విధంగా బలమైన పాస్ వర్డు, టూ వే అథన్టికేషను ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఎప్పటికప్పుడు గమనించాలని, అనుమానస్పద లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతేకాకుండా అధికారిక వెబ్సైట్లును లేదా అప్లికేషన్లు మాత్రమే వినియోగించాలన్నారు. యుఆర్ఎల్ ని ధృవీకరించని నకిలీ వెబ్సైట్ లను వినియోగించవద్దన్నారు. నెట్ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్లలో మీ లావాదేవీలు పూర్తయిన వెంటనే మీ సోషల్ మీడియా అకౌంట్స్, ఈ-మెయిల్స్ నుండి లాగ్ అవుట్ అవ్వాలని, సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను జిల్లా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ కోరారు. అమాయక ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లల పై డ్రగ్స్ కేసు నమో దయ్యిందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి డబ్బులను కొల్లగొడుతు న్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 అందించాలని లేదా 1930కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.

8
157 views