
రైతులు, కూలీలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఆళ్లగడ్డ: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయుటలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు A. రాజశేఖర్ , టి. రామచంద్రుడు, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు తోట మద్దులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం లో పర్యటించి వరి ధాన్యం ఆరబోసిన కల్లాల్లో మహిళా రైతులతో మరియు ఉపాధి కూలీలతో వారి సమస్యలు ప్రభుత్వ విధానాల గురించి విచారించారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న వరి పంటలు సాగుచేసిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అనేకసార్లు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద విన్నవించుకున్న ఏ ఒక్క పంట కూడా కనీసం కేజీ అయినా కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మాత్రం మాటల్లో గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నాయన్నారు. మొక్కజొన్న, వరితో పాటు ఉల్లి, పప్పు సెనగ, మినుములు, పత్తి , పొగాకు, మిరపపంటలు వేసిన రైతులు కనీస పెట్టుబడి కాకుండా మధ్య దళారుల చేతుల్లో నిట్ట నిలువునా దోపిడీకి గురి అవుతున్న మార్క్ఫెడ్, ఎఫ్ సి ఐ, సీసీఐ, నాఫెడ్ వంటి సంస్థలు నంద్యాల జిల్లాలో రంగంలోకి దిగి రైతుల నుండి కొనుగోలు చేయడం లేదని, అక్కడక్కడ ఏర్పాటు చేసిన సి సి ఐ సంస్థలన్నీ మధ్య దళారుల చేతుల్లో బందీలుగా మారాయని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావలసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అయిపోయి చివరకు కేంద్రం నుండి రావాల్సిన ఎరువులను కూడా రాబట్టలేక పోతున్నదని ఫలితంగా జిల్లాల్లో యూరియా కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ నారనీ ఆరోపించారు. ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్ల వ్యవసాయంలో తీవ్రంగా నష్టాల పాలైన పేద రైతులు ,కౌలు రైతులు కనీసం కూలిపనైన చేసుకొని బతుకుదామని అనుకుంటే అందరికీ ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కార్పొరేట్లకు వారి యంత్రాలకు పని కల్పించే ఉద్దేశంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో తనకున్న బలాన్ని ఉపయోగించుకొని జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీజీ పేరున ఉన్న చట్టాన్ని పేరు మార్పు చేసి జి రామ్ జి బిల్లు ప్రవేశపెట్టి దేశంలోని కూలీల అందరిని మోసం చేస్తున్నదన్నారు. గతంలో ఉన్న 90 మరియు 10% రద్దు చేసి 60 మరియు 40 శాతం కేంద్ర, రాష్ట్రాల నిధుల కేటాయింపుతో 150 రోజులు పని కల్పిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నదన్నారు. ఇప్పటికే నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న మన రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జి రాంజీ బిల్లు వలన ఉన్న ఉపాధి కూడా లేకుండా పోయి కూలీలందరూ ఆకలితో అలమటించే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నాయని విమర్శించారు. అందువల్ల ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతులు , కూలీలందరూ రాజకీయాలకతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేష్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు