
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*జాతీయ గణితశాస్త్ర దినోత్సవము.......
తేదీ: 22-12-2025: శేర్లింగంపల్లి చందానగర్ :ఈరోజు కొండాపూర్ డివిజన్ పరిధిలో గల మాదాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు గణితశాస్త్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజం చిత్ర పదానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బసవలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం గణితశాస్త్ర ఆచార్యులు శ్రీ చిరంజీవి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో గణితశాస్త్ర మూలరూపాలు ఉన్న దేశాలు భారతదేశం, ఈజిప్టు, బాబిలోనియా"* అని అన్నారు.
" *భారతీయులు సున్నాకు, దశాంశ పద్ధతిని ప్రపంచం గణితానికి అందించి గణిత విజ్ఞాన శాస్త్రాభివృద్ధి వేగం పుంజుకోవడానికి కారకులైనారు."* అని అన్నారు. " *మన ప్రాచీన గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, మహావీరాచార్య, శ్రీధర, పావులూరి మల్లన్న, భాస్కరాచార్యులు మరియు ఆధునిక గణితశాస్త్రవేత్తలైన శ్రీనివాస రామానుజం, మహాలనోబిస్, నర్సింగరావు, R.C. బోస్ గణితశాస్త్రనికి విశేషమైన సేవలు అందించారు. ఆధునిక గణితశాస్త్రవేత్తలలో శ్రీనివాస రామానుజం ప్రముఖులు. శ్రీనివాస రామానుజం 13 సంవత్సరాలకే గణితంలో అత్యంత ప్రతిభ చూపిన మేధావి" అని అన్నారు. రామానుజం గణితశాస్త్రంలో అతి క్లిష్టమైన బెర్లో లె నెంబర్లు, యూలర్ స్థిరాంకాలపై స్వయంగా పరిశోధనలు చేశారు. చిన్న వయసులోనే ఐలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. G.S.కార్ రచించిన ' _సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మాథమెటిక్స్'_ అనే పుస్తకం రామానుజం ప్రతిభను బయటికి తీసుకువచ్చింది. ఆ పుస్తకములోని ఆల్ జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ఆచార్యులు సైతం నానా తంటాలు పడేవారు. వారికి కూడ అర్థం కాని సూత్రాలకు ఎవరి సహాయము లేకుండానే రామానుజం అలవోకగా పరిష్కరించేవారు. మ్యాజిక్ స్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్, ఇంటిగ్రూల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు చేసేవారు. 1913లో రామానుజం కనుగొన్న 120 పరిశోధనలను ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ కేంబ్రిడ్జ్ యానివర్సరీ ప్రొఫెసర్ G H హార్డీకి పంపించారు. వారు ఆ పరిశోధనలు చూసి రామానుజాన్ని కేంబ్రిడ్జ్ కి ఆహ్వానించారు. లండన్ లో రామానుజం గణితంపై నిరంతరము పరిశోధనలు జరిపి అనేక క్రొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రనిటి కాలేజీ గౌరవం పొందిన తొలి భారతీయునిగాను, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా ప్రసిద్ధి చెందారు. 1919లో తిరిగి భారతదేశానికి విచ్చేశారు. జీవిత చరమాంకంలో వారు వ్రాసిన మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి చెందినవి. మాక్ తీటా ప్రమేయాలు స్ట్రింగ్ థియరీలో ఉపయోగిస్తున్నారు. వీరి జీవితాన్ని ఆధారంగా చేసుకొని 2015 సంవత్సరములో ఒక చలనచిత్రం కూడా నిర్మింపబడింది. వీరు స్వతంగా 3900 ఫలితాలను సంకలనం చేశారు. వీరు గణిత శాస్త్రానికి చేసిన సేవలను గుర్తించి భారతప్రభుత్వం ఆయన గౌరవార్ధం ఆయన జన్మదినమైన డిసెంబరు 12ను 2012 నుండి జాతీయ గణితశాస్త్ర దినోత్సవముగా ప్రకటించి అమలు చేయుచున్నారు"* అని తెలిపారు. " *గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిదని, గణితశాస్త్రం లేకుండా ప్రపంచం ఏ రంగంలోను ముందంజ వేయలేదు. గణితం మన దైనందిన సమస్యల పరిష్కారంతో పాటు శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, వైద్య, సైబర్ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సి, ఇంజనీరింగ్, వ్యాపార రంగాలలో మరియు సామాజిక స్థితిగతులను గుర్తించి లెక్కవేయడం ఇలా బహుముఖ రంగాలలో ఉపయోగపడుతూ ఉంది. నేటి విద్యార్థులు రామానుజం జీవితాన్ని ఆదర్శంగా తీసికొని గణితశాస్త్రంలో రాణించాలి* " అని కోరారు. " *గణితశాస్త్రంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి"* అని తెలిపారు.
" *విద్యార్థులు చెడు అలవాట్లకు (ధూమపానం, మద్యపానము, మాదకద్రవ్యాల వినియోగం, సోషల్ మీడియా) దూరంగా ఉంటూ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి* " అని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజశేఖర్ సహాయ ప్రధానోపాధ్యాయులు, గణిత శాస్త్ర అధ్యాపకులు నరేందర్ రెడ్డి, మనోహర్, ప్రశాంత్, మంగ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.