logo

వారసత్వానికి గుర్తింపు.. సేవకు పదవోన్నతి: విజయనగరం టీడీపీ జిల్లా పగ్గాలు ప్రసాదుల చెంతకు!


విజయనగరం ఆ కుటుంబం జిల్లాకు పరిచయం చేయనక్కర్లేదు. మీదుమిక్కిలి పట్టణానికి ఇంటింటా సుపరిచితమైన కుటుంబం. ప్రసాదుల పేరు చెప్పగానే చాలు వెంటనే స్మరణకు వచ్చే ఒకే ఒక్క కుటుంబం అది. ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన సాన్నిహిత్యం. నగరంలో రెండవ అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన బంధం. తెలుగుదేశం ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ పట్టం కడుతూనే వస్తోంది. అదే రీతిన పార్టీకి పూర్తి బద్ధులుగా నడుస్తోంది. ఏనాడూ పార్టీ ఆ కుటుంబానికి గానీ, పార్టీకి ఆ కుటుంబం గానీ హేతుబద్ధమైన వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. అందుకే దాదాపు మూడు దశాబ్దాల అయినా ఆ బంధానికి చెద పెట్టలేదు. నగరంలోని దాసన్నపేటలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన ప్రసాదుల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పట్టం కడుతూనే వస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దక్కని ఏకైక అవకాశం తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి కల్పించింది. నాలుగు సార్లు పురపాలక పట్టాన్ని కడుతూ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే ప్రసాదుల కుటుంబం మరోసారి నగరంలో రెపరెపలాడింది. అయితే ఈసారి నగరం నుండి జిల్లా స్థాయి కి పదవోన్నతి కల్పించింది రాష్ట్ర పార్టీ. వివరాల్లోకి వెళితే తాజాగా ప్రసాదుల రామకృష్ణ, కనకమహాలక్ష్మి దంపతుల ఏకైక పుత్రుడు లక్ష్మీ వరప్రసాద్ కు రాష్ట్ర పార్టీ జిల్లా పగ్గాలను అప్పగించింది.
విజయనగరం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో ప్రసాదుల కుటుంబానికి పార్టీలో మరో సముచిత స్థానం కలిపించినట్లయింది. వాస్తవానికి తొలినాళ్లలో ప్రసాదుల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందినప్పటికీ ఆయనకు నగరంలో ప్రజాధరణ ఉన్నట్లు అన్ని పార్టీలు గమనించాయి. దీంతో ఆయనకు ఓ ప్రధాన రాజకీయ నాయకుడిగా గుర్తింపు వచ్చింది. అనంతరం అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమిపాలైనప్పటికీ కూడా తదనంతరం ఆయనే ప్రధాన అనుచరుడిగా మారి అశోక్ కనుసన్నలలో మసులుకుంటూ సొంత మనిషిగా కొనసాగుతూ వచ్చారు. అదే ఆయనకు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రకు పునాది వేసినట్టయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రసాదుల రామకృష్ణ సతీమణి కనకమహాలక్ష్మికి అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఇచ్చి గెలిపించి పురపాలక అధ్యక్షురాలిగా చేశారు. ఆనాటి నుండి వెనుదిరిగి చూడకుండా అప్రతిహతంగా మూడుసార్లు ఆమె ఛైర్పర్సన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రసాదుల రామకృష్ణ మరో 5 ఏళ్లపాటు ఛైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుతం ప్రసాదుల రామకృష్ణ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రసాదుల లక్ష్మీప్రసాద్ రాజకీయ అరంగేట్రం చేసి, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. నిరంతరం పార్టీ సేవలో నిమగ్నమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అదితి విజయలక్ష్మి గజపతిరాజును గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. దీంతో లక్ష్మీ వరప్రసాదు సేవలను గుర్తించిన రాష్ట్ర పార్టీ ఆయనను ఏకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. దీంతో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అయింది. ఇదే ఉత్సాహంతో లక్ష్మీ వరప్రసాదుకు వచ్చిన గురుతర బాధ్యత ను సమర్థవంతంగా నిర్వహించి మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నాం.

9
511 views