
అప్పన్న సన్నిధిలో 'జగన్' జన్మదిన వేడుకలు: 381 గ్రాముల బంగారు పగడాల హారాన్ని సమర్పించిన మజ్జి శ్రీనివాసరావు
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో ఘనంగా జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.ఎస్.ఆర్.సి.పి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వై.ఎస్.ఆర్.సి.పి యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారంను కుటుంబ సమేతంగా అప్పన్న స్వామికి సమర్పించారు. అంతకుముందు వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా ఉందని విమర్శించారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని పార్టీ సెకం మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.