
రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు....సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని, బీజేపీని సాగనంపితేనే దేశానికి భవిష్యత్ ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు.స్థానిక ఎన్‌ఆర్ దాసరి క్రాంతి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, సమితి సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.నారాయణ స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమితి సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇటీవల జరిగిన ఇండిగో సంక్షోభమే నిదర్శనమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడమే కాకుండా, గాంధీ పేరును కూడా లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెడుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై మున్ముందు జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ తదితరులు పాల్గొన్నారు.