logo

*నిత్యం ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు చెడు వ్యసనాలకు దూరంకావొచ్చు* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*


*ప్రపంచ ధ్యాన దినోత్సవం* సందర్భంగా విజయనగరం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో డిసెంబరు 20న నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంను జరుపుకుంటారని, ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మనస్సు, శరీరం మధ్య సమతుల్యతను పెంపొందించడం, ఒత్తిడి తగ్గించడం, అంతర్గత శాంతిని సాధించడం పై ప్రజల్లో అవగాహన పెంచడం అని అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఆందోళనలు, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తోందని, రాజ యోగ ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగ సమతుల్యత సాధ్యమవుతుందని, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరికీ ధ్యానం సమానంగా ఉపయోగకరమని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించి, శాంతియుతమైన మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత శాంతి ద్వారా సమాజ శాంతి సాధ్యమని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుందన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు, అధికారులు కొంత సమయం ధ్యానం చేసారు.
అనంతరం అక్కడకు వచ్చిన విద్యార్ధులు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు కొన్ని ముఖ్య విషయాల గురించి వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమాయక ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్ళ వద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసారని, మీ పిల్లల పై డ్రగ్స్ కేసు నమో దయ్యిందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని, బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి డబ్బులను కొల్లగొడుతు న్నారన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలన్నారు. పోలీసులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మీకు సహాయపడతారని అన్నారు. అదే విధంగా రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కలిపించి, వాహనాలపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందాలని అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోకూడదన్నారు. ఎక్కడైన గంజాయి అమ్మటం లేదా వినియోగిస్తున్నట్లు తెలిసినా, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు గాని డయల్ 100/112కు తెలియచేయాలన్నారు. విద్యార్ధులకు మహిళా చట్టాలు మరియు పోక్సో చట్టం వాటి శిక్షల గురించి జిల్లా ఎస్పీ వివరించారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ఇంచార్జ్ బి.కే.అన్నపూర్ణ సిస్టర్, డా.జి.సరస్వతి, మాజీ ప్రిన్సిపల్ జేఎన్ టియుకే, విజయనగరం, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు మరియు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0
0 views