
*మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం సాధించాలి*
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్*
విజయనగరం జిల్లా పోలీసుశాఖకు ఎంపికైన 116మంది కానిస్టేబుళ్ళు 9 మాసాల ప్రాధమిక శిక్షణ నిమిత్తం పోలీసు శిక్షణ కేంద్రాలకు వెళ్ళే సమయంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వారితో మమేకమై, శిక్షణలో అనుసరించాల్సిన తీరు, క్రమశిక్షణ పట్ల జిల్లా పోలీసు కార్యాలయం వద్ద డిసెంబరు 20న దిశా నిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో విధులు నిర్వహించడం సులువుగా లభించే అవకాశం కాదన్నారు. ఉద్యోగం సాధించేందుకు శారీరకంగా మంచి నైపుణ్యం, రాత పరీక్షలో ప్రతిభ కనబరిస్తేనే సాధ్యమైందన్న విషయాన్ని మరువరాదన్నారు. పోలీసు ఉద్యోగం మిగిలిన శాఖలకు భిన్నమైనదని, విధి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. మారుతున్న నేరాలకు అనుగుణం గా వృత్తి నైపుణ్యంను మెరుగుపర్చుకొని, సాంకేతికతతో నేరాలను నియంత్రించడం, నమోదైన కేసులను చేధించడం చేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా, సమాజంలో తప్పు చేసిన వ్యక్తులను సంస్కరించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు, మోసాలు మనకు ఛాలెంజింగుగా నిలుస్తున్నాయన్నారు. వీటిని చేధించేందుకు మనం కనబడని శత్రువుతో పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. పోలీసుశాఖలో మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నతంగా ఎదగవచ్చునన్నారు. సాధించింది కానిస్టేబులు ఉద్యోగమేనన్న నిరాశ వద్దని, మంచి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహిస్తే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ స్థాయికి కూడా ఎదగవచ్చునన్నారు. కావున, పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి, వివిధ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగువర్చు కోవాలని, కంప్యూటరు శిక్షణలో మెళుకవలను అందిపుచ్చుకొని, సైబరు నేరాలను చేదించడం, నియంత్రించడం చేయాలన్నారు. 9 మాసాల శిక్షణ పూర్తయ్యేనాటికి ప్రతీ ఒక్కరూ మెరికల్లా తయారవ్వాలన్నారు. సమాజానికి పట్టిన జబ్బును వదిలించే ఒక డాక్టరులాగ పోలీసులు పని చేయాల్సి ఉంటుందన్నారు. సమాజంలో తప్పు చేసిన వ్యక్తులను శిక్షించడంతోపాటు, వారిని సంస్కరించి, సన్మార్గంలో నడిపించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వద్దని, క్రమశిక్షణ, అంకిత భావంతో ప్రాధమిక శిక్షణ పూర్తి చేసి విజయనగరం జిల్లాకు, మీ తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరును తీసుకొని రావాలన్నారు. శిక్షణ ప్రారంభ దశలో వచ్చే అవరోధాలను మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. శిక్షణ కాలంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, పూర్తిగా శిక్షణ పైనే మనస్సు లగ్నం చేసి, నైపుణ్యాలను సాధించాలని, జిల్లా పోలీసుశాఖకు భవిష్యత్తులో మీరు కీలకంగా మారాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. మహిళా కానిస్టేబుళ్ళుగా జిల్లా నుండి ఎంపికైన 38 మంది ఒంగోలు పోలీసు శిక్షణ కేంద్రానికి, 78 మంది కానిస్టేబుళ్ళుగా ఎంపికైన పురుషులను చిత్తూరు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి వెళ్ళుతున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరవు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, సిసిఎస్ సిఐ ఎస్.కాంతారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ నీలిమ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.