
క్రిస్మస్ వేడుకలపై ఆంక్షల తొలగింపు... మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవతో విద్యాశాఖ కొత్త సర్క్యులర్ జారీ.
నంద్యాల (AIMA MEDIA): జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో, విద్యాశాఖ అధికారులు పాత సర్క్యులర్‌ను సవరిస్తూ డిసెంబర్ 19 శుక్రవారం సరికొత్త ఉత్తర్వులను జారీ చేశారు.ఈ నెల 10వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేస్తూ, జిల్లాలోని ఏ పాఠశాలలోనూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించరాదని ఆదేశించారు. ఈ నిర్ణయం క్రైస్తవ మైనార్టీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ విషయాన్ని మాజీ కౌన్సిలర్ కృపాకర్, సెక్రటరీ ప్రభుదాస్ తక్షణమే మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి ఫరూక్ వెంటనే జిల్లా విద్యాశాఖ మరియు ఉన్నతాధికారులతో మాట్లాడారు.మతసామరస్యాన్ని కాపాడాలని, పండుగలు జరుపుకోవడంపై అభ్యంతరాలు ఉండకూడదని సూచించారు. మంత్రి ఫరూక్ ఆదేశాలతో స్పందించిన అధికారులు, కొత్త సర్క్యులర్ విడుదల చేస్తూ విద్యార్థులు, యాజమాన్యాలు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు.విషయం తెలిసిన వెంటనే స్పందించి, సర్క్యులర్ మార్పుకు కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి క్రైస్తవ మైనార్టీ నాయకులు, పెద్దలు మరియు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వమత సమానత్వాన్ని చాటిచెప్పేలా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.