
జిల్లాలో గంజాయి, నాటుసారాను అరికట్టాలి: ఎక్సైజ్ అధికారికి కాంగ్రెస్ వినతి
పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి, నాటుసారాను అరికట్టాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు, సీనియర్ నాయకులు కోలా కిరణ్ కుమార్, కోలా ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ బొమ్మాలి మోహన్ రావు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, మంత్రపూడి వెంకటరమణ తదితరులు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ అధికారి జి.రామమూర్తితో జిల్లాలో నాటుసారా, గంజాయి నియంత్రణ విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడిశాకు ఆంధ్ర సరిహద్దుగా ఉండటంతో కొమరాడ, పార్వతీపురం, సాలూరు పాలకొండ నియోజకవర్గం లోని కొన్ని మండలాలకు గజాయి, నాటుసారా విరివిగా దిగుమతి అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నాటసారా వలన పలు కుటుంబాలు ఆర్థికంగా శారీరకంగా చితికిపోయి వీధిన పడుతున్నాయన్నారు. గంజాయి వలన యువకుల జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. కాబట్టి గంజాయి నాటుసారా జిల్లాలో లేకుండా వాటిని అరికట్టాలన్నారు. అలాగే రానున్న క్రిస్టమస్ సంక్రాంతి పండుగ రోజుల్లో వాటి రవాణా పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆయా రోజుల్లో వాటిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో నాటుసారా, గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగం లేకుండా చేయాలన్నారు. వాటికి పాల్పడే వారికి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు.