logo

మహిళా లెక్చరర్‌తో అసభ్య ప్రవర్తన ఆకతాయికి దేహశుద్ధి

జర్నలిస్టు:మాకోటి మహేష్

కళాశాలలోనే దాడి చేసిన బంధువులు.. ఫర్నిచర్ ధ్వంసం

రంగప్రవేశం చేసిన పోలీసులు..
రాజీతో ముగిసిన వైనం?

దిశ,గద్వాల క్రైం : గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్‌ను వేధిస్తున్న ఓ ఆకతాయికి ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు గత మూడు రోజులుగా సదరు లెక్చరర్‌ను వేధిస్తున్నట్లు సమాచారం. ఆమె కళాశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడటం, ఫోన్ నంబర్ ఇవ్వాలని వేధించడం, బైక్‌పై డ్రాప్ చేస్తానంటూ అసభ్యంగా ప్రవర్తించడం వంటి చేష్టలకు పాల్పడ్డాడు. సదరు యువకుడి వేధింపులు భరించలేక బాధితురాలు ఈ విషయాన్ని తన సన్నిహితులకు, బంధువులకు వివరించింది.

కళాశాలలో ఘర్షణ

యువకుడి తీరును ప్రశ్నించేందుకు విద్యాసంస్థల చైర్మన్ సమక్షంలో అతడిని కళాశాలకు పిలిపించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహిళా లెక్చరర్ బంధువులు సదరు యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ తోపులాటలో కళాశాలలోని ఫర్నిచర్ పాక్షికంగా ధ్వంసమైంది. గొడవ పెద్దది కావడంతో విద్యాసంస్థల చైర్మన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల ఎంట్రీ - రాజీ ప్రయత్నాలు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సదరు ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మహిళా లెక్చరర్ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కొందరు పెద్దమనుషులు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. 'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది' అన్న చందంగా, విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి, కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఆకతాయికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసి, రాజీపత్రం రాయించుకుని వదిలేసినట్లు సమాచారం.

0
0 views