
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు: విజయనగరంలో సిపిఐ భారీ రాస్తారోకో!
ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ( పి పి పి ) విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ లు మండిపడ్డారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ విధానం విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని, రాజ్యాంగం లోని మౌలిక సూత్రాలకు విరుద్ధమై సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్యగా రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590 ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించడం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నెంబర్ 590 తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 107జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని, నూతన వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించి నిర్వహించాలని, వాటిని శాశ్వత ప్రభుత్వ, ప్రజా ఆస్తులుగా నిలిపి, పేద ప్రజలు వైద్య విద్య హక్కును, సామాజిక న్యాయాన్ని భవిష్యత్తు తరాల అవకాశాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు బుగత.పావని, పురం.అప్పారావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పొందూరు.అప్పలరాజు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ఎన్.నాగభూషణం, బి. వాసు, వి. రాజేష్, సుమన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు