logo

ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి:జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో వాక్సిన్ వేయించి, పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాల్సిన బాధ్యతను అధికారులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో పల్స్ పోలియో కార్యక్రమం సన్నాహకాలపై జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 2,38,404 మంది ఉన్నారని తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 1,318 బూత్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు 5,272 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ నెల 21న ఆదివారం రోజున బూత్ స్థాయిలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, అనంతరం 22, 23 తేదీలలో ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సంత మార్కెట్లు వంటి జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్సిట్ పాయింట్లు (బూత్‌లు) ఏర్పాటు చేసి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటుక బట్టీలు, పరిశ్రమలు, వ్యవసాయ కూలీల పిల్లల కోసం మొబైల్ టీమ్‌ల ద్వారా పోలియో చుక్కలు వేయించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని లైన్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో పని చేసి పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పోలియో చుక్కలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సి. సుదర్శన్ బాబు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఓ. లలిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ శ్రీజ, డాక్టర్ శ్రీనివాసులు, అలాగే ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రవాణా తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

2
10 views