
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి మరియు జిల్లా కలెక్టర్.
నంద్యాల (AIMA MEDIA): తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా, స్థానిక సంజీవనగర్ గేటులోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. "పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని. ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు " అని తెలిపారు. శ్రీరాములు దీక్ష మరియు త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకూ స్ఫూర్తినిచ్చి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పొట్టి శ్రీరాములు గారు చేసిన ఈ మహోన్నత త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్ర చరిత్రలో పొట్టి శ్రీరాములు గారి త్యాగం సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, అందరూ సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మార్వో శ్రీవాణి , మున్సిపల్ కమిషనర్ శేషన్న , టీడీపీ నాయకులు బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా, పబ్బతి వేణు , చలం బాబు మరియు స్థానిక నాయకులు, అధికారులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరజీవికి తమ నివాళులు అర్పించారు.