కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి.
నంద్యాల (AIMA MEDIA): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ హాలులో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు చూపిన అచంచల దీక్ష, స్వార్థరహిత త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన జీవితం ప్రజాసేవకు అంకితమైందని, ప్రజల హక్కుల సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుడని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అందరూ శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో నిబద్ధత, నిజాయితీ, బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీ పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులు అర్పించారు.